Share News

Honeymoon Horror: నా కొడుకుపై సోనమ్ తంత్ర ప్రయోగం.. రఘువంశీ తండ్రి ఆరోపణ

ABN , Publish Date - Jun 17 , 2025 | 10:48 PM

హనీమూన్‌కు వెళ్లి భార్య కుట్రకు బలయిన రాజాపై అంతకుముందే సోనమ్ తంత్ర ప్రయోగం చేసి ఉంటుందని అతడి తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.

Honeymoon Horror: నా కొడుకుపై సోనమ్ తంత్ర ప్రయోగం.. రఘువంశీ తండ్రి ఆరోపణ
Meghalaya Honeymoon Murder

ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో మృతుడు రాజా రఘువంశీ తండ్రి.. నిందితురాలు సోనమ్‌పై మరో ఆరోపణ చేశారు. ఆమె తన కుమారుడిపై తంత్ర ప్రయోగం చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ.. భార్య సొనమ్‌తో కలిసి హనీమూన్‌కు వెళ్లి చివరకు ఆమె కుట్రకు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సోనమ్‌తో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, సోనమ్ సూచన మేరకు రాజ్ కుశ్వాహా తమ ఇంటి చూరుకు ఏదో చిన్న వస్త్రం చుట్టి ఉన్న పొట్లాన్ని కట్టాడని మృతుడి తండ్రి పేర్కొన్నారు. దుష్ట శక్తులు, నర ఘోష తగలకుండా ఇలా చేశానని రాజ్ చెప్పినట్టు తెలిపారు. ఆ తరువాత తాము ఆ పొట్లాన్ని తొలగించినట్టు వెల్లడించారు. ‘ఆమె మా కుమారుడిపై తంత్ర ప్రయోగం కూడా చేసి ఉంటుందన్న అనుమానం కలుగుతోంది’ అని ఆయన అన్నారు.


జ్యోతిష్కుడి సూచనల మేరకు సంప్రదాయబద్ధంగా సోనమ్, రాజ్‌ల వివాహం జరిపించామని రాజ్ తల్లి కన్నీరు మున్నీరవుతూ చెప్పారు. పెళ్లైన నాలుగు రోజుల తరువాత తమ ఆచారం ప్రకారం సోనమ్ తన పుట్టింటికి వెళ్లిందని అన్నారు. ఆ సమయంలో ఆమెను నవ్వుతూ సాగనంపామని అన్నారు. ఆమెను మళ్లీ కలిస్తే తన కొడుకును ఎందుకు చంపావని ప్రశ్నిస్తానని ఆవేదన వ్యక్తం చేశారు.

మే 23న సోనమ్, రాజ్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. జూన్ 2న అతడి మృత దేహం స్థానిక పోలీసులకు లభించింది. ఆ తరువాత ఏడు రోజులకు యూపీ ఘాజీపూర్ బస్ స్టాండ్‌లో సోనమ్ ప్రత్యక్షమైంది. తనకు ఎవరో మత్తు మందు ఇచ్చారని కట్టుకథ చెప్పింది. అయితే, రాజా హత్యలో సోనమ్‌దే కీలక పాత్ర అని అప్పటికే అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో ఆమె నేరం రుజువు చేశారు.


కేవలం ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణం అయి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘వాస్తవం చెప్పాలంటే.. హత్యకు నిందితులు చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. దీని వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నాము. పెళ్లైన నాలుగు రోజులకే భర్తను చంపేంత శత్రుత్వం కలిగిందంటే నమ్మశక్యంగా లేదు. చూడటానికి ఇది లవ్ ట్రయాంగిల్‌లా కనిపిస్తున్నా మరో కోణం ఉండే అవకాశం కూడా ఉంది’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. బాధితులకు ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం

27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 11:30 PM