Share News

Maoists: మావోయిస్టుల మందుపాతర... 8 మంది జవాన్ల మృతి

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:50 AM

బస్తర్‌లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని 50 కిలోల ఐఈడీతో పేల్చేశారు.

Maoists: మావోయిస్టుల మందుపాతర... 8 మంది జవాన్ల మృతి

25 అడుగుల ఎత్తు ఎగిరి తునాతునకలైన జవాన్ల వాహనం

50 కిలోల పేలుడు పదార్థాల వాడకం

‘హిడ్మా ఆపరేషన్‌’పై అనుమానాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఘటన

చర్ల, చింతూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): బస్తర్‌లో మావోయిస్టులు మరోమారు పంజా విసిరారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని 50 కిలోల ఐఈడీతో పేల్చేశారు. పేలుడు శబ్దం 10 కిలోమీటర్ల వరకు వినిపించగా.. రోడ్డుపై ఐదు మీటర్ల మేర, ఐదడుగుల లోతుతో గొయ్యి ఏర్పడింది. పేలుడుధాటికి వాహనం 25 అడుగుల ఎత్తుకు ఎగిరిపడగా.. డ్రైవర్‌, 8 మంది జవాన్ల దేహాలు ఛిద్రమైపోయాయి. వీరంతా దక్షిణ అబూజ్‌మడ్‌లో ఎన్‌కౌంటర్‌(నలుగురు నక్సల్స్‌ చనిపోయారు) నుంచి దంతేవాడకు ఎస్‌యూవీలో తిరిగి వస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరుముగ్గురు జవాన్ల తల భాగాలు గుర్తించేలా ఉండగా.. మిగతా వారి శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. ఇటీవల దక్షిణ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌(ఇద్దరు మహిళలు) మృతిచెందారు.

ఆ తర్వాత దంతేవాడ, బీజాపూర్‌, నారాయణపూర్‌, బస్తర్‌, కొండగాం జిల్లాల డీఆర్జీ బలగాలు.. సీఆర్పీఎఫ్‌ జవాన్లు కూంబింగ్‌ కొనసాగించారు. అదనపు బలగాలు రావడంతో పలు బృందాలు వెనుదిరిగాయి. ఈ క్రమంలో దంతేవాడ డీఆర్జీకి చెందిన జవాన్లు బామన్‌ సోడి, బుధ్రామ్‌ కోస్రా, దుమ్మ మాడ్కమి, హరీశ్‌, పాండ్రూ, సోముడు, సుబర్నాథ్‌ యాదవ్‌, సుదర్శన్‌ వెట్టి, డ్రైవర్‌(పేరు తెలియాల్సి ఉంది)తో కలిసి ఎస్‌యూవీ(సీజీ17-కేడబ్ల్యూ7937)లో.. మరికొందరు జవాన్లు ఇతర వాహనాల్లో సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. మావోయిస్టులు ఈ సమాచారం అందుకుని, బెద్రా గ్రామశివారులో కుట్రు రహదారిపై సుమారు 50 కిలోల ఐఈడీని అమర్చారు. సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు జవాన్ల వాహనాల శ్రేణి ఆ ప్రాంతాన్ని దాటుతుండగా.. చివరి వాహనం ఆ ప్రాంతానికి రాగానే ఐఈడీని పేల్చారు. వాహనం 25 అడుగుల ఎత్తుకు ఎగిరి.. 30 అడుగుల దూరంలో పడింది. డ్రైవర్‌ మృతదేహం చిన్నచిన్న ముక్కలుగా తెగిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ వాహనానికి ముందున్న ఎస్‌యూవీలోని ఏడుగురు జవాన్లకు కూడా గాయాలైనట్లు చెబుతున్నారు. ముందు వాహనాల్లోని జవాన్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జవాన్లపై మావోయిస్టుల దాడిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి ఖండించారు.2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామని అమిత్‌షా పునరుద్ఘాటించారు.

Updated Date - Jan 07 , 2025 | 05:01 AM