Share News

political leader surrender: సంచలన లొంగుబాటు

ABN , Publish Date - Oct 16 , 2025 | 05:02 AM

భారత విప్లవోద్యమ చరిత్రలోనే సంచలనం! లొంగుబాటు ఘట్టాల్లో అతి భారీ సన్నివేశం......

political leader surrender: సంచలన లొంగుబాటు

  • నాలుగు దశాబ్దాల పోరును వదిలి మల్లోజుల వేణుగోపాల్‌ సరెండర్‌

  • రూ.6కోట్ల రివార్డు వేణుగోపాల్‌కే అప్పగింత

పెద్దపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భారత విప్లవోద్యమ చరిత్రలోనే సంచలనం! లొంగుబాటు ఘట్టాల్లో అతి భారీ సన్నివేశం బుధవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆవిష్కృతమైంది. నాలుగు దశాబ్దాల సాయుధ పోరాటాన్ని వదిలి మావోయిస్టు పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌, సోను దాదా, భూపతి జనజీవన స్రవంతిలో కలిశారు. మరో 60మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో సహా మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ సమక్షంలో ఆయన లొంగిపోయారు. మల్లోజుల లొంగుబాటు మహారాష్ట్ర సహా రెడ్‌ కారిడార్‌ పరిధిలోని తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టుల పతనానికి నాంది పలికిందని ఈ సందర్భంగా ఫడణవీస్‌ వ్యాఖ్యానించారు. కాగా, వేణుగోపాల్‌పై రూ.ఆరు కోట్ల రివార్డు ఉంది. ఆ రివార్డును ఆయనకు సీఎం అందించారు. వేణుగోపాల్‌ది ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి పట్టణం. కాగా, ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి సలాకుల సరోజ అలియాస్‌ లత, నిర్మల్‌ జిల్లా కుంచనపల్లికి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు ఇర్రి మోహన్‌రెడ్డి అలియాస్‌ వివేక్‌ వీరిలో ఉన్నారు.

లేఖల యుద్ధంతో మొదలై..

సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌, ఎంసీసీలు 2004లో ఏకమై సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన నాటినుంచి పెద్దఎత్త్తున ఆయుధాలతో ఒక పొలిట్‌బ్యూరో స్థాయి నేత లొంగిపోవడం ఇదే ప్రథమం. వివిధ కారణాలతో గతంలో అనేకమంది నక్సలైట్లు లొంగిపోయారు. కానీ, ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోయిన ఉదంతం ఇదే కావడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర క్రితం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టింది. దండకారణ్యం, కర్రెగుట్టలు, అబూజ్‌మడ్‌ కేంద్రంగా మావోయిస్టులను మట్టుబెడుతోంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు సహా 27మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. ఆ తర్వాత మరో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. కగార్‌ని నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, మావోయిస్టులు కోరుతున్నప్పటికీ, తగ్గేదిలేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబుతోంది. ఇదేక్రమంలో నెలరోజుల క్రితం సాయుధ పోరాటాన్ని వదిలి పెట్టాలనీ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి పార్టీని రక్షించుకోవాలంటూ మల్లోజుల వేణుగోపాలరా విడుదల చేసిన లేఖ విప్లవ శిబిరంలో కలకలం రేపింది. ఆయన వైఖరిని మావోయిస్టులు ఖండించారు. లొంగి పోవాలనుకుంటే ఆయుధాలను పార్టీకి ఇచ్చి లొంగిపోవాలని ఆయనకు అల్టిమేటం జారీచేశారు.


భార్యాభర్తలిద్దరూ సీఎం ఎదుట లొంగుబాటు..

మల్లోజుల వేణుగోపాల్‌ సహచరి, కేంద్రకమిటీ సభ్యురాలు సిదాం విమల చంద్ర అలియాస్‌ తార ఈ ఏడాది జనవరి 1న ఫడణవీస్‌ ఎదుట లొంగిపోగా, వేణుగోపాలరావు కూడా ఆయన ఎదుటే లొంగిపోయారు. ఆయన హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోనున్నారని వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాగా, తార లొంగిపోయినప్పుడు సీఎం ఫడణవీస్‌ మాట్లాడుతూ, వేణుగోపాల్‌ కూడా ఆరుమాసాల్లో వస్తాడని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే వేణుగోపాల్‌ సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు సహచరి, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత అలియాస్‌ మైనా ఈ ఏడాది సెప్టెంబరు 13వ తేదీన హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయారు.

Updated Date - Oct 16 , 2025 | 05:02 AM