Share News

Maoist Leader: మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు

ABN , Publish Date - Oct 15 , 2025 | 04:10 AM

గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు, ప్రజాసంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్లుగానే..

Maoist Leader: మల్లోజుల వేణుగోపాల్‌రావు లొంగుబాటు

  • గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత

    ఆయనతోపాటు మరో 60

  • మంది.. 54 ఆయుధాల అప్పగింత

  • నక్సలైటు ఉద్యమంలో మల్లోజులది 45 ఏళ్ల ప్రస్థానం

  • పార్టీ సిద్ధాంతకర్తగా, బాహ్యప్రపంచంతో అనుసంధానకర్తగా పేరు ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో భిన్న వైఖరి

  • సాయుధ పోరు వదిలేద్దామని మల్లోజుల ప్రతిపాదన, లేఖ

  • వదిలేది లేదని ప్రకటించిన పార్టీ

  • కొంతకాలంగా మల్లోజుల లొంగుబాటుపై ఊహాగానాలు

  • ఆయన మీద రూ.6 కోట్ల రివార్డు, 100కుపైగా కేసులు

పెద్దపల్లి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): గత కొన్ని రోజులుగా వామపక్షవాదులు, ప్రజాసంఘాల శ్రేణులు ఊహిస్తున్నట్లుగానే.. సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో, సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు పోలీసులకు లొంగిపోయారు. నాలుగున్నర దశాబ్దాల ఉద్యమ, అజ్ఞాత జీవితం వీడి మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయన లొంగిపోయారు. వీరిలో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీకి చెందిన ముగ్గురు సభ్యులు, పలు డివిజినల్‌ కమిటీలకు చెందిన పది మంది సభ్యులు కూడా ఉన్నారు. మొత్తం 54 ఆయుధాలతో సహా వీరు లొంగిపోయారని, ఆ ఆయుధాల్లో ఏడు ఏకే 47లు, తొమ్మిది ఇన్సాస్‌ రైఫిళ్లు ఉన్నాయని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో మావోయిస్టులు వారంతటవారే లొంగిపోయేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మహారాష్ట్రలోని హోడ్రి అనే గ్రామం వద్ద నుంచి వారిని పోలీసు వాహనాల్లో గడ్చిరోలి పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చామని వెల్లడించారు. అక్కడ ఆయుధాలను అప్పగించి వారు లొంగిపోయారన్నారు. కాగా, మల్లోజుల వేణుగోపాల్‌రావు మీద రూ.6 కోట్ల రివార్డు ఉంది. వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి.


  • అత్యంత కీలక నేతల్లో ఒకరు

70 ఏళ్ల వయసున్న వేణుగోపాల్‌రావు అలియాస్‌ భూపతి, సోనును మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా భావిస్తారు. ఆ పార్టీ సిద్ధాంతకర్తగా ఆయనకు పేరుంది. ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లోని పార్టీకి బాహ్యప్రపంచానికి మధ్య ఆయన అనుసంధానకర్తగా కూడా వ్యవహరించినట్లు సమాచారం. ఆపరేషన్‌ కగార్‌ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మావోయిస్టు పార్టీ

  • లొంగుబాట్ల వెనుక పోలీసు నిఘా వర్గాల సుదీర్ఘ కసరత్తు

ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరణించిన తర్వాత.. పార్టీకి తదుపరి సారథ్యం వహించే నేతల్లో వేణుగోపాల్‌రావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే, ఆ బాధ్యతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీకి అప్పగించారని, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారని వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, కగార్‌లో భాగంగా వరుసగా ఎన్‌కౌంటర్లు జరగటం, మావోయిస్టు పార్టీ అత్యంత సీనియర్‌ నేతలను, సెంట్రల్‌ కమిటీ సభ్యులను కోల్పోవటం జరుగుతూ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెబుతున్నట్లుగానే ఈ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, మావోయిస్టు పార్టీలో అంతరంగిక చర్చ ప్రారంభమైనట్లు సమాచారం. ఆయుధాలు విడిచిపెట్టి జనజీవనస్రవంతిలో కలిసి, ప్రజా సమస్యలపై బహిరంగ ఉద్యమాలు నిర్మించాలని తద్వారా మావోయిస్టు పార్టీని రక్షించుకుందామని వేణుగోపాల్‌ ప్రతిపాదించగా.. దానిని ఇతర నేతలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్‌ నుంచి అనూహ్యంగా విడుదలైన ఒక బహిరంగలేఖ పెను సంచలనం సృష్టించింది. సాయుధపోరును తాత్కాలికంగా వదిలిపెట్టి శాంతిమార్గంలోకి వస్తామని, ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిద్ధమంటూ ఆయన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ హోదాలో, తన ఫొటో ముద్రించి ఉన్న లేఖను విడుదల చేశారు. ఈ లేఖకు ప్రతిగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌.. సాయుధ పోరాటాన్ని వీడేది లేదంటూ ఓ లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత కూడా వేణుగోపాల్‌ తన ప్రతిపాదనను సమర్థిస్తూ మరో లేఖ విడుదల చేశారు. దీంతో ఆయన లొంగిపోవడం ఖాయమని అంతా భావించారు. వారం రోజుల క్రితమే ఆయన హైదరాబాద్‌ పోలీసులకు లొంగిపోయారనే వార్తలు కూడా వెలువడ్డాయి. తాజాగా, ఆయన మహారాష్ట్రలో పోలీసుల ఎదుట లొంగిపోయినప్పటికీ, అందుకు సంబంధించిన ఫొటోలను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. కాగా, వేణుగోపాల్‌రావుకు మావోయిస్టు పార్టీలో కొన్ని కమిటీలు మద్దతు తెలపటం, భారీ సంఖ్యలో లొంగిపోవటం వంటి పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, వేణుగోపాల్‌రావు ప్రోద్బలంతోనే తెలంగాణలోని భద్రాది-కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో పలువురు మావోయిస్టులు లొంగిపోయినట్లుగా పోలీసు వర్గాలు తెలిపాయి.


ఆనందంగా ఉంది

తమ బాబాయి అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు రావడం ఆనందంగా ఉందని మల్లోజుల వేణుగోపాల్‌రావు పెద్దన్న ఆంజనేయులు కుమారుడు దిలీ్‌పశర్మ తెలిపారు. ఆయన ఎలా ఉంటారో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. ఉద్యమంలోకి వెళ్లిపోయిన కొడుకులను ఒక్కసారైనా చూడాలన్న కోరిక నెరవేరకుండానే నానమ్మ మధురమ్మ మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టుల పునరావాసానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని దిలీప్‌ శర్మ పేర్కొన్నారు.

ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 81, 141 బెటాలియన్‌ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌ చేయూతతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో బీజాపూర్‌ జిల్లాకు చెందిన మిలీషియా కమాండర్‌ పడ్డం లక్మా, సీఎన్‌ఎం కమాండర్‌ దొడ్డి బుడ్రు, పార్టీ సభ్యులు లేఖం బండి, మడవి కోసా, మిలీషియా మెంబర్‌ మడవి లక్మా, సుక్మా జిల్లాకు చెందిన పార్టీ సభ్యుడు కుంజం పాపారావు ఉన్నారు.

కోటన్న స్ఫూర్తిగా అడవి బాట

పెద్దపల్లి పట్టణానికి చెందిన మధురమ్మ, వెంకటయ్య దంపతులకు మల్లోజుల మూడో సంతానం. ఆయన రెండో అన్న మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌జీ 1975లో సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పని చేశారు. 2011 నవంబరు 11న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించారు. సోదరుడు కిషన్‌జీ స్ఫూర్తితోనే వేణుగోపాల్‌రావు సైతం 1980 ప్రాంతంలో నక్సల్‌ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. 2010 ఏప్రిల్‌లో దంతేవాడలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమైన ఘటనలో వేణుగోపాల్‌ కీలకపాత్ర పోషించారని చెబుతారు. అదే ఏడాది కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన అనంతరం కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా వేణుగోపాల్‌ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అభయ్‌ పేరిట లేఖలు విడుదల చేసేవారు. ఉద్యమంలో వేణుగోపాల్‌కు సహచరిగా ఉన్న గడ్చిరోలి జిల్లాకు చెందిన సిడాం విమలచంద్ర అలియాస్‌ తారక అలియాస్‌ వత్సల ఈ ఏడాది జనవరి 1న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఎదుట లొంగిపోయారు.

Updated Date - Oct 15 , 2025 | 04:10 AM