Maoist Leader: లొంగుబాట్ల వెనుక సుదీర్ఘ కసరత్తు
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:48 AM
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్, ఇతర కీలక నేతలు.....
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్, ఇతర కీలక నేతలు, బలగాలతో కలసి లొంగిపోవడం, భారీ సంఖ్యలో ఆయుధాలనూ అప్పగించడం వెనుక పోలీసు, నిఘా వర్గాలు సుదీర్ఘ కసరత్తు చేసినట్టు సమాచారం. కేంద్రంతోపాటు తెలంగాణ, ఏపీకి చెందిన నిఘావర్గాలు కొన్నాళ్లుగా ఇందుకోసం ఈ లొంగుబాట్ల కోసం రంగం సిద్ధం చేస్తూ వస్తున్నట్టు తెలిసింది. ఈ ఏడాది మేలో ఛత్తీ్‌సగఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందిన తర్వాతి పరిణామాలు కీలకంగా మారాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో పార్టీలో పార్టీలో తీవ్ర అంతర్మథనం జరిగినట్టు తెలిసింది. ఈ దశలోనే లొంగుబాట్ల దిశగా నిఘా వర్గాలు మావోయిస్టులపై మరింత ఒత్తిడి పెంచాయి. అదే సమయంలో ఆగస్టు 15న రాసినట్టు ఉన్న మల్లోజుల వేణుగోపాల్ లేఖ గత నెలలో విడుదల కావడం, పార్టీ వైఫల్యాలను ఆయన అంగీకరించడం, ఉద్యమాన్ని కొనసాగించలేని పరిస్ధితులను ప్రస్తావించడం ద్వారా ఆయన లొంగుబాటు సిద్ధమయ్యారనే సంకేతాలు అందాయి. మిగతా క్యాడర్‌నైనా బతికించుకోవాలనే లక్ష్యంతో మల్లోజుల ఒపికగా అడుగులు వేశారని.. లొంగుబాట్లను ప్రోత్సహించే విధంగా, లొంగిపోయిన వారికి ప్రాణహనీ ఉండదనే సంకేతాలు క్యాడర్‌లోకి వెళ్లేలా ప్రకటనలు చేశారని నిఘావర్గాలు చెబుతున్నాయి. తొలుత ఆయన తెలంగాణలో లొంగిపోవచ్చని ప్రచారం జరిగినా.. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకే మహరాష్ట్రలో లొంగిపోయినట్టు సమాచారం. కీలక నేతలు సహా 60 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోవడం, ఏకే 47లు, ఇన్సాస్ రైఫిళ్లు సహా 54 కీలక ఆయుధాలను అప్పగించడం వ్యూహంలో భాగమేనని తెలిసింది.