Leader Ashanna : అన్నల దారెటు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:38 AM
ఎన్‌కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో మావోయిస్టులతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల....
లొంగుబాటా సమరం కొనసాగింపా
3000 నుంచి 500కు పడిపోయిన సంఖ్య
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో మావోయిస్టులతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ పేరిట భీకర ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది జనవరిలో సుమారు 3000 మంది మావోయిస్టులు ఉన్నట్లు అప్పట్లో నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తాజా లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ల తర్వాత ప్రస్తుతం వీరి సంఖ్య 500కి చేరిందని సమాచారం. మావోయిస్టులకు గుండెకాయ లాంటి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో 250, తెలంగాణ కమిటీలో 60, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్ స్పెషల్ జోనల్ కమిటీలో 70, ఈస్ట్రన్ రీజనల్ బ్యూరోలో 70, ఒడిసా రాష్ట్ర కమిటీలో 50 మంది మాత్రమే మిగిలారని తెలుస్తోంది. వీరికి మద్దతుగా సుమారు 5000 మంది మిలీషియా సభ్యులు ఉండవచ్చని నిఘా వర్గాలు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఇక, కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య కూడా 20 నుంచి పదికి పడిపోయింది. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు ఆరుగురు, జార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్ నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. వీరిలో అత్యధికులు 60 ఏళ్లు దాటినవారు. తెలంగాణకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) ప్రస్తుతం మాడ్ ఏరియాలో పనిచేస్తున్నారు. కేంద్ర కమిటీ సలహాదారు, సీనియర్ మావోయిస్టు నేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (75) అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూ దళాల రక్షణలో ఉన్నారు. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (64) తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. పాక హన్మంతు అలియాస్ ఉకే గణేశ్ (64) ఒడిసాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (73) పార్టీ రక్షణలో ఉన్నారు. పసునూరి నరహరి అలియాస్ విశ్వనాధ్ (58) జార్కండ్‌లో శరందా ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన మాడ్వి హిడ్మా (51) పార్టీలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ దాడులకు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తుంటారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. మాడ్ ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్న మజ్జిదేవ్ అలియాస్ రణధీర్ (56) దళం నుంచి చాలామంది ఇటీవల లొంగిపోయారు.
ఇక, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో బడే చొక్కారావు (46), కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (49), రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ (50) వివిధ ఏరియాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు ఉన్న దళ సభ్యుల సంఖ్య సుమారు 60 మంది మాత్రమేనని, దళ సభ్యుల్లో అత్యధికం ఇతర రాష్ట్రాల వారేనని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, మావోయిస్టు పార్టీలో కీలకమైన ప్రజా గెరిల్లా సైన్యాన్ని నడిపించడానికి కావాల్సిన నాయకత్వంలో చాలామంది కనుమరుగు కాగా, తిరుపతి, హిడ్మాలాంటి దూకుడుగా వ్యవహరించే నాయకులు ఉన్నారని, లొంగుబాట్ల ప్రభావం వీరిపై తక్కువగా ఉండవచ్చని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో.. పార్టీ కార్యదర్శి బాధ్యతలను ఎవరు చేపట్టవచ్చనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ సారథిగా తిప్పిరి తిరుపతికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరిగినా.. లొంగిపోయిన మావోయిస్టులు అది వాస్తవం కాదని చెబుతున్నారు. మరోవైపు, మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ వెనక కుట్ర కోణం ఉందన్న అనుమానాలను ప్రజా సంఘాల నేతలు తాజా లొంగుబాట్ల నేపథ్యంలో మరోసారి లేవనెత్తుతున్నారు. అయినా.. మిగిలిన మావోయిస్టుల దారెటు!? వాళ్లు కూడా లొంగిపోతారా!? లేక ఉద్యమాన్ని కొనసాగిస్తారా!? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికైనా లొంగిపోండి
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందచేస్తున్న పునరావాస ప్యాకేజీ ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు గౌరవప్రదమైన జీవితం లభిస్తుందని, వారిపై కేసుల విషయంలో సానుభూతిగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.