Maoist leader: వదులుతోంది ఆయుధాలనే పోరును కాదు
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:29 AM
భారీ సంఖ్యలో మావోయిస్టులతో కలిసి వచ్చి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆయుధాలను .....
పంథాను మార్చుకుని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం: ఆశన్న
భారీ సంఖ్యలో మావోయిస్టులతో కలిసి వచ్చి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆయుధాలను అప్పగించిన కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న.. దానికి ఒకరోజు ముందు జాతీయ న్యూస్ చానల్‌తో మాట్లాడారు. తాము ఆయుధాలను మాత్రమే వదిలిపెడుతున్నామని, పోరాటాన్ని కాదని తెలిపారు. తమ చర్యను లొంగుబాటుగా ప్రభుత్వం భావిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ‘‘పోరాటం కొనసాగుతుంది. అయితే, పోరాటానికి సంబంధించిన పంథా మారుతుంది. ఆయుధాలతో ప్రజా యుద్ధాన్ని కొనసాగించలేమని మా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావు(బసవరాజ్) సహా పలువురు సీనియర్ నాయకులు గ్రహించారు’’ అని తెలిపారు. ఈ ఏడాది మే 25న జరిగిన ఎన్‌కౌంటరులో ఆయన మరణించారని, ఆయుధాలను వదిలి, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజాస్వామ్య పద్ధతిలో రూపొందించాలని అంతకుముందు ఆయన సూచించారని ఆశన్న తెలిపారు. ఆయన మరణం తర్వాత ఈ అంశంపై తమ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతి పెరిగిపోయాయని వివరించారు. ప్రభుత్వ బలగాల్లో చేరి తాము నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో భాగం కాబోమన్నారు.