Share News

Maoist Leader: ఆయుధం వీడి

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:31 AM

దాదాపు మూడున్నర దశాబ్దాల సాయుధ పోరాటానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు....

Maoist Leader: ఆయుధం వీడి

  • ఆయుధాలు వీడిన మావోయిస్టులతో ఆశన్న (వృత్తంలో)

  • జన జీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్ర నేత ఆశన్న

  • మరో 208 మంది కూడా..

  • వీరిలో 110 మంది మహిళలు

  • పోరు వదల్లేదు.. ఇకపై రాజ్యాంగబద్ధంగా పని: ఆశన్న

  • ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి సమక్షంలో భారీగా ఆయుధాల అప్పగింత

చర్ల/చింతూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దాదాపు మూడున్నర దశాబ్దాల సాయుధ పోరాటానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న వీడ్కోలు పలికారు. ఆయనతోపాటు దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు భాస్కర్‌ (రాజ్‌మాన్‌ మాంధవీ), రాజు సలాం, వెన్ను దట్టి (సంతు), మాడ్‌ డివిజన్‌ కార్యదర్శి రణిత సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడారు. వీరిలో 110 మంది మహిళలు ఉండగా, 98 మంది పురుషులు. జగదల్‌పూర్‌లోని పోలీస్‌ లైన్‌లో ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి సమక్షంలో శుక్రవారం వీరంతా ఆయుధాలు అప్పగించారు. దేశంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ లొంగుబాటు చర్రితలో నిలిచిపోతుందని సీఎం విష్ణుదేవ్‌ సాయి అన్నారు. కాగా, గడిచిన మూడు రోజుల్లోనే 348 మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ల్లో జన జీవన స్రవంతిలో కలిశారు.

ఎర్ర గులాబీలతో స్వాగతం

కాంకేర్‌ జిల్లా నుంచి 60 మంది, బీజాపూర్‌ నుంచి 148 మంది మావోయిస్టులు గురువారం అడవుల నుంచి బయటకు వచ్చి జన జీవన స్రవంతిలో కలిసిన సంగతి తెలిసిందే. వీరిని ప్రత్యేక బస్సుల్లో జగదల్‌పూర్‌లోని పోలీస్‌ లైన్‌ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఉదయం వారిని సీఎం సభ ప్రాంగణం వద్దకు బస్సుల్లో తీసుకొచ్చారు. కొంతమంది మావోయిస్టులు డ్రెస్‌ కోడ్‌ మార్చగా.. మరి కొంతమంది సివిల్‌ దుస్తుల్లో వచ్చారు. అత్యధికులు మాత్రం మావోయిస్టు పార్టీ డ్రెస్‌ కోడ్‌లోనే అక్కడికి చేరుకున్నారు. ఛత్తీ్‌సగఢ్‌ డీజీపీ అరుణ్‌ దేవ్‌ గౌతమ్‌ వారికి స్వాగతం పలికారు. శాంతి, ప్రేమ, నూతన జీవితానికి గుర్తుగా రాజ్యాంగం పుస్తకం, ఎర్ర గులాబీ అందజేశారు. ఆశన్నను మాత్రం కారులో సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు తాము వాడిన 153 తుపాకులను అప్పగించారు. వాటిలో ఎల్‌ఎంజీ తుపాకీ 1, ఏకే 47 తుపాకులు 19, ఇన్సాస్‌ తుపాకులు 23, ఎల్‌ఎల్‌ఆర్‌ 17, 303 రైఫిళ్లు 36, కార్బన్‌ 4, బీజీఎల్‌ తుపాకులు 11, 12 బోర్‌ తుపాకులు 41, పిస్తోలు ఒకటి ఉన్నాయి.


మౌనంగా కనిపించిన అన్నలు

లొంగిపోవడానికి వచ్చిన మావోయిస్టులు మౌనంగా కనిపించారు. వారి ముఖాల్లో ఏమాత్రం చిరునవ్వు కనిపించలేదు. బస్సులు దిగిన దగ్గర నుంచి పోలీసులు చెప్పినట్లు చేశారు. కార్యక్రమం ముగింపులో లొంగిపోయిన అందరితో రాజ్యాంగంపై ప్రమాణం చేయించారు. కాగా, ‘‘నేటి నక్సల్స్‌ లొంగుబాటు చారిత్రక విజయం. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇల్లు, భూమి కూడా ఇస్తాం’’ అని విష్ణుదేవ్‌సాయి వ్యాఖ్యానించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి విజయ శర్మ మాట్లాడుతూ, లొంగిపోయిన వారు డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ)లో చేరతామంటే అవకాశం కల్పిస్తామని, డీఆర్‌జీలో కేవలం 10 శాతం మాత్రమే లొంగిపోయిన నక్సల్స్‌ ఉన్నారని తెలిపారు.

మావోయిస్టుల్లో చీలికలు తీవ్రతరం

మావోయిస్టు ఉద్యమంలో చీలికలు తీవ్ర రూపం దాల్చాయని, ఆయుఽధాలు వదిలి లొంగిపోయేందుకు ఇంకా చాలామంది మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారని ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు (సోను, భూపతి) తమకు చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘ఉద్యమం రెండు గ్రూపులుగా చీలిపోయింది. శాంతి చర్చలను కోరుతున్న సోను, ఆశన్న, రాజ్‌మాన్‌ మందావీ తదితరులు ఒక గ్రూపు కాగా, ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న దేవ్‌జీ, హిడ్మా, ప్రభాకర్‌ తదితరులు మరో గ్రూపుగా ఏర్పడ్డారు’’ అని పేర్కొన్నాయి.

తుపాకులు అప్పగించడంపై

అన్నల గుర్రు!

ఆయుధాలు వీడాలని లేఖలు రాస్తూ మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌లో లొంగిపోయిన కేంద్ర కమిటీ మాజీ సభ్యులు అభయ్‌, ఆశన్నపై మావోయిస్టు పార్టీ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘లొంగిపోవడం మీ వ్యక్తిగత అభిప్రాయం. అది పార్టీ అభిప్రాయం కాదు’’ అని అందులో స్పష్టం చేసింది. లొంగిపోతే లొంగిపోవాలని, కానీ, పార్టీ ఇచ్చిన తుపాకులను పార్టీకి అప్పగించి లొంగిపోవాలంటూ వారికి సూచించింది. తుపాకులు ఇవ్వకపోతే పీఎల్‌జీఏతో దాడి చేయిస్తామని కూడా హెచ్చరించింది. కానీ, అభయ్‌, ఆశన్నలు తమ దళాలతో లొంగిపోతూ భారీగా ఆయుధాలను అప్పగించారు ఈ నేపథ్యంలో, 200పైగా తుపాకులను పోలీసులకు అప్పగించడంపై మావోయిస్టు అగ్రనాయకత్వం గుర్రుగా ఉందన్న వార్తలొస్తున్నాయి.

Updated Date - Oct 18 , 2025 | 03:31 AM