అడిగినంత పనీర్ వేయలేదని పెళ్లి మండపంలో దారుణం..
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:59 PM
Uttar Pradesh News: తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు.

పెళ్లి వేడుకలో మూడు ముళ్ల తంతు గురించి పక్కన పెడితే.. జనాలు పదే పదే మాట్లాడుకునే విషయం వంటలు. వంటలు అద్భుతంగా ఉన్నా.. తిని పేర్లు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే, పెళ్లి మండపాల్లో గొడవలకు కారణమయ్యే విషయాల్లో వంటలు టాప్‌లో ఉంటాయి. వెజ్ కావచ్చు.. నాన్ వెజ్ కావచ్చు.. తమకు నచ్చినంత వడ్డించలేదని గొడవలు పడేవారు ఎక్కువ. తాజాగా, ఓ వ్యక్తి పనీర్ కర్రీ కోసం పెళ్లి మండపంలో అలజడి సృష్టించాడు. మినీ బస్సుతో మండపంలో నానా రచ్చ చేశాడు. ఈ ఘటనలో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో శనివారం చోటుచేసుకుంది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ వారాణాసిలోని పహాడీ గ్రామానికి చెందిన రాజనాథ్ యాదవ్ కూతురి పెళ్లి హమీద్ పూర్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం పహాడీ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బంధుజనం హమీద్ పూర్ చేరుకున్నారు. రాత్రి విందులో మినీ బస్ డ్రైవర్ ధరేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నాడు. తనకు ఇష్టమైన పనీర్ కర్రీని ఇంకా కొంచెం ఎక్కువ వేయాలని వడ్డిస్తున్న వారిని అడిగాడు. ఇందుకు వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ధరేంద్ర వారితో గొడవపడ్డాడు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. కొద్దిసేపటి తర్వాత పెళ్లి కూతురు తండ్రి అక్కడికి వచ్చాడు.
పెద్ద గరిటెతో అతడి తలపై కొట్టాడు. ధరేంద్ర కోపంగా అక్కడినుంచి బయటకు వెళ్లిపోయాడు. ఒక ఐదు నిమిషాల తర్వాత మినీ బస్సుతో పెళ్లి మండపంలోకి దూసుకువచ్చాడు. మినీ బస్సుతో మండపంలో రచ్చ రచ్చ చేశాడు. బస్సు దాడి కారణంగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురి చిన్నాన్న కూడా ఉన్నారు. గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. భీభత్సం సృష్టించిన తర్వాత ధరేంద్ర బస్సుతో సహా అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Bumrah-Sanjana: నా కొడుకు జోలికొస్తే వదలను.. బుమ్రా భార్య వార్నింగ్
Pahalgam Return: అదీ.. భారత్ దమ్ము.. పహల్గాంలో ఆశ్చర్యకర దృశ్యం