Mumbai Crime: డ్రగ్స్ నిందితుల దారుణం.. తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాడని ఆగ్రహంతో..
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:05 PM
ముంబైలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మాదక ద్రవ్యాల పంపిణీని అడ్డుకుంటున్నాడన్న అక్కసుతో బాంద్రాలోని ఓ వ్యక్తిని నిందితులు అతడి ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్రగ్స్ పంపిణీని అడ్డుకుంటున్నాడన్న అక్కసుతో బాంద్రాలోని ఓ వ్యక్తిని కొందరు దారుణంగా కత్తితో పోడిచి చంపేశారు. ఈ దాడిలో అతడి కుటుంబసభ్యులు కూడా గాయపడ్డారు. గురువారం ఈ దారుణం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం రాత్రి దర్గా గల్లీలోని షకీర్ అనీ సెండోల్ ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చిన కొందరు అతడిపై పదునైన వస్తువులు, కత్తులతో దాడి చేశారు. ఇష్టారీతిన పొడవడంతో షకీర్ దుర్మరణం చెందాడు. ఈ దాడిలో షకీర్ బంధువు షిరీన్, మేనల్లుడు అప్జల్2కు కూడా గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి ఇమ్రాన్ పఠాన్, అతడి భార్య ఫాతిమా జకీర్ అలీ, ఉస్మాన్ జకీర్ అలీ, జకీర్ అలీ సెండోల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇమ్రాన్ పఠాన్, అతడి భార్యపై ఇప్పటికే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. బాండ్రా ప్రాంతంలో వారు డ్రగ్స్ సప్లై చేస్తుంటారని పోలీసులు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతోనే తన సోదరుడిపై నిందితులు దాడి చేశారని మృతుడి సోదరి ఫిరోజా పేర్కొంది. వారిపై గతంలోనూ ఫిర్యాదు చేశామని, తమపై నిందితులు బెదిరింపులకు దిగేవారని అన్నారు. కానీ ఈ దాడికి కుట్ర పన్నింది మాత్రం సల్మాన్, అతడి భార్యేనని ఆమె చెప్పారు. వారే పఠాన్ దంపతులకు డ్రగ్స్ సరఫరా చేస్తుంటారని అన్నారు.
నిందితులు బ్యాట్‌తో పాటు తల్వార్‌తో తన సోదరుడిపై దారుణంగా దాడి చేశారని ఫిరోజా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘కడుపులో పేగులు బయటకొచ్చేలా పొడిచారు. బ్యాట్‌తో తలపగలగొట్టారు’’ అని అన్నారు. తమపై ఫేక్ అత్యాచారం కేసు పెట్టి వేధింపులకు దిగుతున్నారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అత్యాచారం కేసు గురించి ప్రస్తావించలేదు.
మరోవైపు, ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరాతో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయి, దాడికి కుట్ర పన్నింది ఎవరో అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఫ్యామిలీని కాపాడుకునేందుకే బీజేపీతో ఎడప్పాడి పొత్తు.. డీఎంకే స్పందన
అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. అమిత్‌షా బిగ్ స్టేట్‌మెంట్
ఎన్‌ఐఏ దర్యాప్తునకు ముంబై పోలీసుల సహకారం: ఫడ్నవిస్