Mamata Banerjee : మొదలైన సర్ 2.0
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:29 AM
దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) రెండో విడత కార్యక్రమం మంగళవారం మొదలైంది
నిరసనగా కోల్‌కతాలో రోడ్డెక్కిన మమత
ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు, బెంగాల్, కేరళ
న్యూఢిల్లీ, నవంబరు 4: దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) రెండో విడత కార్యక్రమం మంగళవారం మొదలైంది. ఇందులోభాగంగా నెలరోజులపాటు దాదాపు 51 కోట్లమంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈసీ అధికారులు చేపడతారు. ఈ ప్రక్రియలో భాగం అవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళల్లోని అధికార పార్టీలు ‘సర్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ వ్యతిరేకతల మధ్యనే ఈ ప్రక్రియను ఈసీ ప్రారంభించాల్సి వచ్చింది. ‘సర్’ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించింది. డీఎంకే పిటిషన్ ఈ నెల 6 లేక 7 తేదీల్లో విచారణకు రానుంది. పశ్చిమ బెంగాల్‌లో ‘సర్’ ప్రక్రియపై టీఎంసీ అధినేత్రి, ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కోల్‌కతాలో రోడ్డెక్కారు. అర్హుడైన ఒక్క ఓటరు పేరును జాబితానుంచి తొలగించినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. దీనిని రాజకీయ ప్రేరేపిత సవరణ ప్రక్రియగా ఆమె దుయ్యబట్టారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె మంగళవారం కోల్‌కతాలో ‘సర్’కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. మైనారిటీలకు, వెనుకబడిన వర్గాలకు ఈ ప్రక్రియ వ్యతిరేకమైనదన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలనే ఈసీ ఎంచుకోవడం వెనుక ఉద్దేశాన్ని ఆమె ప్రశ్నించారు. చివరిగా 2002లో బెంగాల్‌లో ‘సర్’ కార్యక్రమం నిర్వహించారు. అప్పట్లో రెండేళ్లపాటు ఈ ప్రక్రియను సాగించిన ఈసీ ఈసారి కేవలం నెలరోజులకే పరిమితం చేయడం ఏంటని నిలదీశారు.