Maoist Movement: భారీగా లొంగుబాట్లు
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:25 AM
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీఎత్తున లొంగుబాట పడుతున్నారు.
కాంకేర్‌లో 50.. బీజాపూర్‌లో 140 మంది వీరిలో వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా
ఆయన వెంటే నాయకులు రాజమల్లు, రనిత
నేడు ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి సమక్షంలో తుపాకులు వీడనున్న మావోయిస్టు నేతలు
చర్ల, మంచిర్యాల, చింతూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీఎత్తున లొంగుబాట పడుతున్నారు. మొన్న అగ్రనేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ అభయ్‌తోపాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా.. గురువారం ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రంలోని కాంకేర్ పోలీసుల ఎదుట 50 మంది, బీజాపూర్ జిల్లాలో మరో 140 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న కూడా ఉన్నారు. ఆయన వెంట దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు, రనిత కూడా
ఇంద్రావతి నది దాటి వస్తున్న మావోయిస్టులు
ఉన్నారు. తొలుత, వీరంతా ఉప్పారి ఘాట్ వద్ద సమావేశమయ్యారు. అనంతరం బోట్లపై ఇంద్రావతి నదిని దాటి బీజాపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సుల్లో బీజాపూర్ జిల్లా బైరంగడ్ పోలీస్ క్యాంపునకు తరలించారు. అక్కడి నుంచి వారిని జగ్‌దల్‌పూర్‌కు తీసుకెళ్లారు. వీరు తమ వెంట 70 తుపాకులు, పేలుడు సామగ్రిని తీసుకెళ్లారు. అలాగే, కాంకేర్‌లో లొంగిపోయిన 50 మందిని కూడా జగ్‌దల్‌పూర్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సమక్షంలో వీరంతా తుపాకులు వీడనున్నారు. ఆశన్న లొంగుబాటును కూడా శుక్రవారమే అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా.. మావోయిస్టులు ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోవడం ఇదే మొదటిసారి.
మాడ్ ఏరియా కమిటీ ఖాళీ
కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్నతోపాటు మాడ్ ఏరియా కమిటీ సభ్యులంతా శుక్రవారం లొంగిపోనున్నారు. వీరిలో 10 మందికిపైగా డీవీసీఎం సభ్యులున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి మాడ్ ఏరియా చాలా కీలకమైన ప్రాంతం. అక్కడి నుంచే మావోయిస్టులు పార్టీని నడిపించేవారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని మావోయిస్టులంతా పూర్తిగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అబూజ్‌మడ్ ప్రాంతం ఖాళీ కాగా తాజాగా మాడ్ ప్రాంతమూ ఖాళీ అయినట్లు అవుతోంది. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లోని 336 జిల్లాలకు విస్తరించిన మావోయిస్టుల ప్రభావం.. ప్రస్తుతం 3 జిల్లాలకే పరిమితమైంది. పలు రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన అన్నలు.. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, మావోయిస్టు పార్టీలో నెలకొన్న విభేదాలను అంచనా వేయలేకపోయారు. దీంతో, ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ చతికిలపడింది. కాగా.. అడవుల్లో ప్రస్తుతం మావోయిస్టుల సంఖ్య కేవలం 200 వరకు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో.. ఛత్తీ్‌సగఢ్‌లో హిడ్మా, పాపారావు, తిప్పరి తిరుపతి టార్గెట్‌గా కేంద్ర బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
అందరూ లొంగిపోవాలి: ఛత్తీ్‌సగఢ్ ఉప ముఖ్యమంత్రి విజయశర్మ
మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని ఛత్తీ్‌సగఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ శర్మ కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ కగార్‌తో బస్తర్ డివిజన్‌లోని కొండగావ్, దంతెవాడ, కాంకేర్ జిల్లాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిందని, నారాయణపూర్, సుకుమా, బీజాపూర్ జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల కదలికలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మార్చికి ఇతర జిల్లాల్లో కూడా నక్సల్స్ ప్రభావం ఉండదన్నారు. మావోయిస్టులు లొంగిపోతామని అంటే స్వాగతిస్తామని, లొంగుబాటు కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రావడం లేదని తెలిపారు.
రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ కూడా!?
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శి బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ అలియాస్ అశోక్ కూడా హైదరాబాద్‌లో పోలీసు అధికారుల ఎదుట లొంగిపోవడానికి నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బండి ప్రకాశ్ మంచిర్యాల జిల్లా మందమర్రివాసి. బండి రామారావు, అమృతమ్మ దంపతుల నలుగురు బిడ్డల్లో రెండో సంతానం. 40 ఏళ్ల కిందట మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై అడవి బాట పట్టారు. మందమర్రి సీపీఐ నేత వీటి అబ్రహం హత్య కేసులో ప్రకాశ్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. అప్పట్లో ఆ కేసులో అరెస్టయిన ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. అక్కడి నుంచే మావోయిస్టు నేతలు నల్ల ఆదిరెడ్డి, ముంజం రత్నయ్య, హుస్సేన్‌తోపాటు బండి ప్రకాశ్ కూడా 1988లో తప్పించుకున్నారు. నల్ల ఆదిరెడ్డి ఆ సమయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు. కాగా, ఆయనను తప్పించడంలో ప్రకాశ్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చర్చల సందర్భంగా అడవిని వదిలి బయటకు వచ్చిన ప్రకాశ్.. చర్చలు విఫలమైన తర్వాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయా రు. ప్రకాశ్ సికాస కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో సికాస పటిష్ఠానికి ఆయన తనవంతు కృషి చేశారనే పేరుంది. అలాగే, ప్రభాత్ పేరుతో ఆయన ప్రెస్ నోట్లు, కరపత్రాలు విడుదల చేసేవారు. ఆయన లొంగుబాటుతో సికాస బాధ్యతలు చూసేవారు కరువయ్యారనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. కాగా, పోలీసుల రికార్డుల ప్రకారం.. ప్రకాశ్ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది.
చంద్రబాబుపై దాడిలో ఆశన్న కీలకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కీలక మావోయిస్టు దాడుల్లో తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కీలక పాత్ర పోషించారు. ఆయన స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్.గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతుల పెద్ద కుమారుడు ఆయన. ఐటీఐ పాలిటెక్నిక్ చదివిన ఆయన.. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. 2010 ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో చేరారు. దాడుల వ్యూహాలను రూపొందించడంలో, బాంబుల తయారీలో చేయి తిరిగిన ఆశన్న.. ఐపీఎస్ ఉమే్‌షచంద్ర, మాజీ హోం మంత్రి మాధవరెడ్డిపై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆశన్నదే. మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హత్యకు 2003, 2007లో రెండుసార్లు దాడి చేశారని చెబుతారు. అలాగే, గడ్చిరోలిలో 2019లో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో 15 మంది మహారాష్ట్ర పోలీసులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు కీలక సూత్రధారి ఆశన్న. పార్టీలో అత్యంత ప్రమాదకరమైన మావోయిస్టుల్లో ఆశన్న ఒకరు. మూడు దశాబ్దాలుగా ఆయనను పట్టుకోవడానికి పోలీసులు విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే!