Share News

Harassment by Police Officers: అరచేతిపై సూసైడ్‌నోట్‌..వైద్యురాలి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:08 AM

ఆమె ఓ ప్రభుత్వ వైద్యురాలు! తనపై ఓ పోలీసు అధికారి గత ఐదునెలల్లో నాలుగుసార్లు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడని....

Harassment by Police Officers: అరచేతిపై సూసైడ్‌నోట్‌..వైద్యురాలి ఆత్మహత్య

  • మహారాష్ట్రలో దారుణం.. ఓ ఎస్సై తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ప్రాణం తీసుకున్న ప్రభుత్వ డాక్టర్‌

  • మరో పోలీసు అధికారి మానసికంగా వేధించాడని వెల్లడి

  • పోస్టుమార్టం, ఫిట్‌నెస్‌లపై నకిలీ నివేదికల కోసం పోలీసు

  • అధికారులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు

  • గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసినా పట్టించుకోని వైనం

  • ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం.. ఎస్సైపై వేటు

ముంబై, అక్టోబరు 24: ఆమె ఓ ప్రభుత్వ వైద్యురాలు! తనపై ఓ పోలీసు అధికారి గత ఐదునెలల్లో నాలుగుసార్లు దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడని.. అతడి తీవ్ర శారీరక, మానసిక వేధింపులను తాళలేకే ప్రాణాలు తీసుకుంటున్నానంటూ అరచేతిపై సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఫడణవీస్‌ ఆదేశాల మేరకు వైద్యురాలు ఆరోపణలు గుప్పించిన ఎస్సైని సస్పెండ్‌ చేస్తున్నట్లు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మృతురాలు సతారా జిల్లాలో వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. తనపై గోపాల్‌ బాద్నే అనే ఎస్సై.. నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అరచేతిపై ఆమె రాసుకున్నారు.


అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ లాడ్‌పుత్రే కూడా తనను మానసికంగా తీవ్ర వేఽధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఈ పోలీసు అధికారుల వేధింపుల గురించి ఆమె గతంలోనే.. అంటే జూన్‌ 19న ఫల్తాన్‌ డీఎస్పీకి లేఖ రాశారు. లేఖలో ఆమె ఇవే ఆరోపణలు చేశారు. గోపాల్‌, లాడ్‌పుత్రే కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయానని.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, విచారణ చేసి, ఆ ఇద్దరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ఆమె కోరారు. వైద్యురాలు రెండేళ్ల క్రితమే సతారా ఆస్పత్రిలో డ్యూటీలో చేరారు. పోస్టుమార్టం, ఫిట్‌నె్‌సలపై నకిలీ నివేదికల కోసం ఆమెపై పోలీసు అధికారులు తీవ్ర ఒత్తిడి చేశారని.. ఆ వేధింపులు భరించలేకే ఆమె ప్రాణాలు తీసుకున్నారని వైద్యురాలి బంధువు ఆరోపించారు. పోలీసు అధికారుల వేధింపులపై డీఎస్పీ, ఎస్పీకి ఆమె రెండు, మూడుసార్లు లేఖలో ఫిర్యాదు చేశారని.. అయినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన విమర్శించారు. వైద్యురాలి చావుకు కారణమైన పోలీసు అధికారులను వెంటనే ఆరెస్టు చేసి.. మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. వైద్యురాలి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారుపై ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత నాందేవ్‌రావు ఎక్స్‌ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలను రక్షించాల్సిన పోలీసులే వారిని వేధిస్తే న్యాయం ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. తన పట్ల పోలీసు అధికారుల దుశ్చర్యలపై గతంలోనే బాధితురాలు లేఖలు రాసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. దారుణాలకు పాల్పడుతున్న పోలీసులకు మహారాష్ట్ర ప్రభుత్వమే కాపాడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. వైద్యురాలి ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ పేర్కొంది. తన మీద జరుగుతున్న వేధింపులపై వైద్యురాలు గతంలోనే ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ జరుపుతామని బీజేపీ ఎమ్మెల్సీ, మహారాష్ట్ర మహిళా ప్రెసిడెంట్‌ చిత్రావాగ్‌ పేర్కొన్నారు. కాగా గతంలో వైద్యురాలు రాసిన లేఖపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్‌, ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Oct 25 , 2025 | 04:08 AM