Share News

Maharashtra: పుట్టినరోజు వేడుక జరుగుతుండగా కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం

ABN , Publish Date - Aug 29 , 2025 | 05:12 AM

అది నాలుగు అంతస్తుల భవనం. మంగళవారం అర్ధరాత్రి దాటింది.. సమయం 12:05 గంటలు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో గొప్ప సందడిగా ఉంది.

Maharashtra: పుట్టినరోజు వేడుక జరుగుతుండగా కుప్పకూలిన భవనం.. 17 మంది దుర్మరణం

పాల్ఘర్‌, ఆగస్టు 28: అది నాలుగు అంతస్తుల భవనం. మంగళవారం అర్ధరాత్రి దాటింది.. సమయం 12:05 గంటలు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో గొప్ప సందడిగా ఉంది. తమ బిడ్డ ఉత్కర్ష (1) తొలి పుట్టినరోజు వేడుక కోసం దంపతులు ఓంకార్‌ జోవిల్‌ (25), ఆరోహీ ఓంకార్‌ (24) బంధువులు, మిత్రులను పిలుచుకున్నారు. గడియారం సరిగ్గా 12 గంటలు కొట్టగానే.. ఓంకార్‌, ఆరోహీ కలిసి పాప ఉత్కర్ష చేతులు పట్టుకొని, కేక్‌ కట్‌ చేయించారు. చుట్టూ చేరిన అతిథిగణం ‘హేపీ బర్త్‌ డే డియర్‌ ఉత్కర్ష’ అని చప్పట్లతో అభినందిస్తోంది. అయితే ఆ సమయంలో వారి కాళ్లకింద నేల కదిలిపోయింది.. కళ్లుమూసి తెరిచేలోగా ఘోరం జరిగింది! ఆ ఫ్లాట్‌ సహా.. భవనంలోని ఓ భాగం కుప్పకూలిపోయింది. తెల్లవారితే వినాయక చవితి పండుగ అనగా మహారాష్ట్ర పాల్ఘర్‌ జిల్లా విరార్‌లోని నారంగిలో ఈ విషాద ఘటన జరిగింది. పాప ఉత్కర్ష, తల్లిదండ్రులు ఓంకార్‌, ఆరోహీ సహా మొత్తం 17 మంది శిథిలాల కింద చిక్కుకొని మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు.


15 మృతదేహాలను బుధవారం, మరో రెండు మృతదేహాలను గురువారం వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకొని 9మంది గాయపడ్డారు. వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రమాబాయి అపార్ట్‌మెంట్‌ పేరుతో ఉన్న ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని 2011లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. భవనంలో 50 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 12 ఫ్లాట్లు ఉన్న ఓ భాగం పూర్తిగా పక్కనున్న ఓ ఇంటిపై కూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఇల్లు ఖాళీగా ఉండటంతో అక్కడ ఉండేవారికి ముప్పు తప్పింది. సమాచారం అందడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలకు దిగింది. శిథిలాలు తొలగించే పని కొనసాగుతోంది. బిల్డర్‌ నిట్టల్‌ సానేపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని అరెస్టు చేశారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Updated Date - Aug 29 , 2025 | 06:55 AM