Takkalpalli Vasudeva Rao: మావోయిస్ట్ పార్టీకి మరో షాక్.. లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు
ABN , Publish Date - Oct 17 , 2025 | 10:58 AM
మరో మావోయిస్టు సభ్యుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమయ్యాడు. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు దండకారణ్యం విడిచి జనవాసాల్లోకి వచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 17: మావోయిస్ట్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో మావోయిస్టు సభ్యుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమయ్యాడు. కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవరావు దండకారణ్యం విడిచి జనవాసాల్లోకి వచ్చాడు. శుక్రవారం తన అనుచరులతో కలిసి వాసుదేవరావు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి సమక్షంలో తన అనుచరులతో నేడు జగదల్పూర్‌లో లొంగిపోయారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సమక్షంలో మావోయిస్టులు ఆయుధాలు అప్పగించారు. ఆశన్నతో పాటు లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉన్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత ఆశన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉంటడం గమనార్షం. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న (59) బాంబులు తయారు చేసేవాడిగా తెలిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారనిసమాచారం. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆశన్నదే కావడం గమనార్హం. 1999లో రాజకీయ, పోలీసు అధికారుల హత్యలతో ఆశన్నకి సంబంధం ఉందని నిఘా రికార్డులు సమాచారం అందిస్తున్నాయి. తెలంగాణలోని ములుగు జిల్లా పోలొనిపల్లి గ్రామంలో అశన్న మధ్యతరగతి వెలమ కుటుంబంలో జన్మించారు. ITI పాలిటెక్నిక్‌లో చదివి, 1991లో "పీపుల్స్ వార్ గ్రూప్" (PWG)లో చేరాడు. పదేళ్లలోనే అతడిపై వరంగల్ జిల్లాలో 48 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.