Share News

Liquor Shop: యథాతథంగా మద్యం షాపుల లాటరీ

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:01 AM

మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తు గడువును పొడిగించడం సరికాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

Liquor Shop: యథాతథంగా మద్యం షాపుల లాటరీ

  • దరఖాస్తుల గడువు పెంపు సమస్యపై మాత్రం తీర్పు వాయిదా

  • తుది తీర్పునకు లోబడే కొత్త దరఖాస్తుల భవిష్యత్తు :హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల లైసెన్స్‌ దరఖాస్తు గడువును పొడిగించడం సరికాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. గడువు పెంచిన తర్వాత అంటే ఈనెల 19 నుంచి 23 వరకు వచ్చిన దరఖాస్తుల భవిష్యత్తు తాము ఇవ్వబోయే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల లాటరీ తీయడం, కేటాయింపు ప్రక్రియపై మాత్రం ఎలాంటి స్టే ఇవ్వలేదు. మద్యం దుకాణాల దరఖాస్తు చివరిరోజు గడువును ఈనెల 18 నుంచి ఈనెల 23కు పెంచుతూ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ ఒక మెమో జారీచేశారు. ఈ మెమోను సవాల్‌ చేస్తూ దరఖాస్తుదారులు డీ వెంకటేశ్వరరావు, శ్రవణ్‌కుమార్‌గౌడ్‌, మాంజీత్‌ సింగ్‌ బగ్గా, హరీందర్‌పాల్‌ సింగ్‌ బంగా, సుక్మన్‌సింగ్‌ ఓషాన్‌ తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం రెండో రోజు కూడా జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ ధర్మాసనం విచారణ కొనసాగించింది. శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా దరఖాస్తు గడువు పెంపునకు చట్టబద్ధత ఉందా? చివరి గడువు లోపు వచ్చిన దరఖాస్తులను మాత్రమే అంగీకరించాలని నిబంధనల్లో ఉంది కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. శనివారం జరిగిన వాదనల్లో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ ఇమ్రాన్‌ఖాన్‌ వీటికి సమాధానాలు ఇచ్చారు. ‘మద్యం తయారు చేయడం, విక్రయించడంపై ప్రభుత్వానికి ఏకస్వామ్యం ఉంది.


దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 చివరి రోజు కాగా, ఆ రోజున బీసీ సంఘాలు బందు నిర్వహించడంతో ఎవరికీ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో గడువును 23 వరకు పొడిగించింది. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగమే. 5వ పిటిషనర్‌ సుక్మాన్‌ సింగ్‌ ఓషాన్‌, 3వ పిటిషనర్‌ మాంజీత్‌ సింగ్‌ బగ్గాలు 23వ తేదీన దరఖాస్తులు చేశారు. అంటే టెండర్ల ప్రక్రియను అడ్డుకోవడానికే తప్ప వారు మంచి ఉద్దేశంతో పిటిషన్లు వేయలేదన్న విషయం స్పష్టమవుతోంది. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదు’ అని కోరారు. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి వాదిస్తూ.. గడువు పెంచడం ద్వారా తెలంగాణ ఎక్సైజ్‌ మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీ - లైసెన్స్‌ షరతుల నిబంధనలు- 2012ను ప్రభుత్వం ఉల్లంఘించిందని తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు ఫీజు రూ. 3 లక్షలు చెల్లించాల్సి ఉందని, లైసెన్సు వచ్చినా, రాకపోయినా దాన్ని తిరిగి చెల్లించరని అన్నారు. గడువు పెంచుకుంటూ పోతే దరఖాస్తు దారుల సంఖ్య పెరిగి లాటరీ వచ్చే అవకాశాలు భారీగా తగ్గుతాయని చెప్పారు. ఈనెల 19 నుంచి 23 తర్వాత అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారని, కానీ దుకాణాల వారీగా పోటీ ఉంటుందనే విషయాన్ని మరిచిపోతున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 18 తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా? అనేది ఇక్కడ ప్రధాన సమస్య అని వ్యాఖ్యానించింది. దానిపై మాత్రమే ఆదేశాలు ఇస్తామని తెలిపింది.

Updated Date - Oct 26 , 2025 | 04:01 AM