Share News

ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:52 AM

చుట్టూ అయినవాళ్లున్నా.. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ‘తన’ అనుకునేవారు ఒక్కరూ కనిపించని దురదృష్టవంతులు కొందరు! పట్టించుకునేవాళ్లు ఎందరున్నా..

ప్రాణాలు తీస్తున్న ఒంటరితనం

  • కుంగుబాటుకు, ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్న ఏకాకి జీవనం

  • ఏటా ప్రపంచవ్యాప్తంగా 8.71 లక్షల మరణాలు.. డబ్ల్యూహెచ్‌వో నివేదిక

న్యూఢిల్లీ, జూలై 1: చుట్టూ అయినవాళ్లున్నా.. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ‘తన’ అనుకునేవారు ఒక్కరూ కనిపించని దురదృష్టవంతులు కొందరు! పట్టించుకునేవాళ్లు ఎందరున్నా.. తమను తాము ఒంటరిగా భావించుకునేవారు మరికొందరు!! పైకి చూడ్డానికి ఇది చాలా చిన్న సమస్యగానే కనిపించవచ్చుగానీ.. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఒంటరితనం కుంగుబాటుకు.. ఆపై ఆత్మహత్య ఆలోచనలకు దారి తీస్తోంది. ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ‘కమిషన్‌ ఆన్‌ సోషల్‌ కనెక్షన్‌’ తన తాజా అంతర్జాతీయ నివేదికలో పేర్కొన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం. ఆ నివేదిక ప్రకారం..


  • ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఇదే కారణంతో ప్రతి గంటకు దాదాపు 100 మరణాలు.. ఏడాదికి 8.71లక్షల మరణాలు నమోదవుతున్నాయి.

  • ఒంటరితనానికి వయసుతో సంబంధం లేదు. దీంతో బాధపడుతున్నవారిలో అన్ని వయసులవారూ ఉన్నారు. కాకపోతే.. పిల్లలు, వృద్ధులతో పోలిస్తే యువతలో ఈ సంఖ్య ఎక్కువ. వృద్ధుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు, కిశోర ప్రాయంలో ఉన్నవారిలో ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరులే.

  • ఏకాకి జీవితంతో విసిగిపోతున్నవారి సంఖ్య.. దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉంది. అధికాదాయ దేశాల్లో ఒంటరితనం బాధితుల సంఖ్య 11 శాతంగా ఉంటే.. అల్పాదాయ దేశాల్లో ఆ సంఖ్య 24 శాతంగా ఉంది.

  • 13 నుంచి 29 ఏళ్లవారిలో ఒంటరితనంతో బాధపడుతున్నవారి సంఖ్య 17 నుంచి 21 శాతంగా ఉంది. టీనేజర్లలో ఈ సమస్య చాలా ఎక్కువ.

విరుగుడు ఏంటి?

ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఆదాయం తక్కువగా రావడం, సరైన చదువు లేకపోవడం, ఏకాకి జీవితం.. ఇలా ఒంటరితనానికి పలు కారణాలు ఉంటాయని నివేదిక తెలిపింది. దీనికి విరుగుడు సామాజిక సంబంధాలను పెంచుకోవడమేనని సూచించింది. ఇతరులతో కలవడానికి అసంఖ్యామైన అవకాశాలున్న ఈ రోజుల్లో చాలా మంది తమను తాము ఒంటరివ్యక్తులుగా భావించుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ వ్యాఖ్యానించారు.


డబ్ల్యూహెచ్‌వో కమిషన్‌ ఆన్‌ సోషల్‌ కనెక్షన్‌ సహాధ్యక్షుడు డాక్టర్‌ వివేక్‌ మూర్తి కూడా.. ఒంటరితనం అనేది ఈ తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా అభివర్ణించారు. ‘డిజిటల్‌గా అనుసంధానమైన ఈ ప్రపంచంలో.. చాలామంది యువతీయువకులు తమను తాము ఒంటరి వ్యక్తులుగా భావించుకుంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని మన బలంగా మార్చుకోవాలి తప్ప బలహీనతగా కాదు. అందుకే.. ప్రభుత్వ విధానాలన్నింటిలోనూ సామాజిక అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలి’ అని వివరించారు.

Updated Date - Jul 02 , 2025 | 05:52 AM