Share News

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:44 AM

అదానీ గ్రూప్‌ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర...

Investment in Adani Raises: జీవిత బీమా..అదానీకి ధీమా

  • సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలకు 33 వేల కోట్ల ఎల్‌ఐసీ సొమ్ము

  • అప్పులు తీర్చేందుకు ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌ కలిసి ఇప్పించాయి

  • రూ.28 వేల కోట్ల బాండ్లు, 5 వేల కోట్ల షేర్లు.. ప్రజల సొమ్ముతో రిస్కీ కంపెనీకి నిధులు

  • ఇది క్రోనీ క్యాపిటలిజం కిందకే వస్తుంది.. వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సంచలన కథనం

  • ప్రజల కష్టార్జితాన్ని అదానీకి ఎలా అప్పగిస్తారు?.. పీఏసీ దర్యాప్తు జరపాలి: కాంగ్రెస్‌

  • అది స్వతంత్ర నిర్ణయమే: ఎల్‌ఐసీ.. పెట్టుబడితో ఎల్‌ఐసీ లాభపడింది: అదానీ గ్రూప్‌

నూఢిల్లీ, అక్టోబరు 25: అదానీ గ్రూప్‌ సంస్థలు మరో వివాదంలో చిక్కుకున్నాయి. చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కున్న అదానీ సంస్థలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ కలిసి ఎల్‌ఐసీని 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించేందుకు ఒప్పించాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ సంచలన కథనం రాసింది. తమనెవరూ ప్రభావితం చేయలేదని, స్వతంత్రంగానే పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నామని ఎల్‌ఐసీ ఖండించినప్పటికీ వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం తీవ్ర దుమారం సృష్టించింది. అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారంటూ 2023లో హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణ ఆ కంపెనీని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టింది. అమెరికా కంపెనీల తరఫున భారతదేశంలో రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చారని స్వయంగా అమెరికా న్యాయశాఖ ధ్రువీకరించిన ఘటనతో 2024లో అదానీ గ్రూప్‌ మరోసారి ఒడిదొడుకులకు లోనైంది. ఇలాంటి తరుణంలో తాజాగా మోదీ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అదానీకి అండగా నిలిచి క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నదంటూ వాషింగ్టన్‌ పోస్టు శనివారం కథనం వెలువరించింది. అదానీ కంపెనీలు ఎదుర్కొంటున్న చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం గత మే నెలలో ఎల్‌ఐసీతో 3.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టించే ప్రతిపాదన చేసిందని కథనం తెలిపింది. అందులో 3.4 బిలియన్‌ డాలర్లు(రూ.28,000 కోట్లు) అదానీ బాండ్లు కాగా, 507 మిలియన్‌ డాలర్లు(రూ.5,000 కోట్లు) అదానీ కంపెనీల్లో

షేర్ల కొనుగోలు. చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి మార్కెట్‌ నుంచి 585 మిలియన్‌ డాలర్లు బాండ్ల రూపంలో సేకరిస్తున్నట్లు ఈ ఏడాది మే నెలలో అదానీ గ్రూప్‌ ప్రకటించింది. కొద్ది రోజుల తర్వాత మే 30న మొత్తం డబ్బులు ఒకే సంస్థ(ఎల్‌ఐసీ) సమకూరుస్తున్నట్లు అదానీ ఒక ప్రకటన చేశారు. వాషింగ్టన్‌ పోస్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన మొత్తం 3,900 మిలియన్‌ డాలర్లు లేదా 33 వేల కోట్ల రూపాయలు. అయితే, ఆదానీ కంపెనీల ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం 90 బిలియన్‌ డాలర్లు. ఎల్‌ఐసీ నుంచి కేంద్రం ఇప్పించదలచింది 3.9 బిలియన్‌ డాలర్లు. తమకు అవసరమైన మొత్తం సొమ్ము ఎల్‌ఐసీ నుంచి సేకరిస్తున్నట్లు గత మే నెలలో అదానీ ప్రకటించినపుడే విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అభివర్ణించాయి.


ప్రభుత్వ బాండ్ల కన్నా ఇదే మెరుగు

అదానీ గ్రూపులోని రెండు సంస్థల్లో 3.4 బిలియన్‌ డాలర్లు బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. ‘‘అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌కు రేటింగ్‌ ఏజెన్సీలు ఏఏఏ రేటింగ్‌ ఇచ్చాయి. అందులో పెట్టుబడి పెడితే 7.5 శాతం నుంచి 7.8 శాతం వరకు ఆదాయం ఆఫర్‌ చేస్తున్నారు. ఏఏఏ క్రెడిట్‌ రేటింగ్‌ ఉంటే ప్రభుత్వ బాండ్లతో సమానం. పదేళ్ల లాకిన్‌ పిరియడ్‌తో ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెడితే 7.2 శాతం మాత్రమే ఆదాయం వస్తుంది. రెండో సంస్థ అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌. దీనికి ఏఏ రేటింగ్‌ లభించింది. దీంట్లో పెట్టుబడి పెడితే 8.2 శాతం ఆదాయం ఆఫర్‌ చేసింది. కాబట్టి ఈ రెండింట్లో పెట్టుబడి పెట్టండి’’ అని ఆర్థిక శాఖ స్వయంగా సూచించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. దీనికి అదనంగా మరో 507 మిలియన్‌ డాలర్లు అదానీ కంపెనీల్లో షేర్ల కొనుగోలు రూపంలో పెట్టాలని సూచించినట్లు చెప్పింది. కొన్నేళ్ల క్రితం ఈ సంక్షోభాలేవీ రాకముందు కూడా ఎల్‌ఐసీ అదానీ గ్రూపు సంస్థల్లో 30 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. అదానీని ఆదుకొనే కార్యక్రమానికి రూపకల్పన చేసిన బృందంలో ఆర్థిక శాఖ ఆర్థిక సేవల విభాగం, ఎల్‌ఐసీ, నీతి ఆయోగ్‌ అధికారులు ఉన్నట్లు తెలిపింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం ఉన్నట్లు చెప్పింది. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు తమకు ఈ విషయం వెల్లడించారని తెలిపింది. మొత్తం వ్యవహారం ఎల్‌ఐసీతో డబ్బులు ఇప్పించడం మాత్రమే కాకుండా దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల్లో అదానీ సంస్థల సామర్థ్యం పట్ల విశ్వాసం పెంచడం లక్ష్యంగా జరిగిందని తెలిపింది. అదానీ గ్రూపు అప్పులు సంస్థ విలువలో 20 శాతానికి చేరిన నేపథ్యంలో ఎల్‌ఐసీతో 3.9 బిలియన్‌ డాలర్ల కమిట్‌మెంట్‌ చేయించడం ద్వారా అదానీ వెనుక తాను ఉన్నానన్న సంకేతాన్ని జాతీయ అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలకు ప్రభుత్వం ఇవ్వదలచిందని పేర్కొంది. అయితే, వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రధానంగా అంతర్జాతీయంగా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని, ఎల్‌ఐసీ లాంటి సంస్థలోని ప్రజాధనాన్ని అందులో పెట్టించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం తనకు ఇంతకన్నా ముఖ్యమైన పనులేవీ లేవన్నట్లుగా అదానీ కొమ్ము కాస్తున్న తీరు క్రోనీ క్యాపిటలిజానికి అద్దం పడుతోందని టిమ్‌ బర్క్‌లే అనే ఆస్ట్రేలియా ఆర్థిక నిపుణుడిని ఉటంకిస్తూ వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్‌ స్పందన కోసం వాషింగ్టన్‌ పోస్ట్‌ అడిగినపుడు ఎల్‌ఐసీ అనేక సంస్థల్లో పెట్టుబడి పెట్టిందని, అదే విధంగా అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు పొందిందని సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక మద్దతు ఉందని అనడానికి ఆధారాలు లేవని, తాము మోదీ అధికారంలోకి రావడానికి ముందు నుంచే వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా పేరు తెచ్చుకున్నామని అదానీ సంస్థ తెలిపిందని వెల్లడించింది.


పాత వివాదాల ప్రస్తావన

గతంలో అదానీ గ్రూప్‌ ఎదుర్కొన్న వివాదాలను కూడా వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం ప్రస్తావించింది. తప్పుడు సమాచారం ద్వారా అమెరికా సంస్థల నుంచి పెట్టుబడులు పొందేందుకు అదానీ గ్రూపు ప్రయత్నించిందని అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను పత్రిక గుర్తు చేసింది. 250 మిలియన్‌ డాలర్లు భారతదేశంలో నాయకులకు, అధికారులకు లంచాలిచ్చి తప్పుడు పత్రాలు తెప్పించుకున్నారని పేర్కొంది. అమెరికా సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజి కమిషన్‌ తమ నిబంధనలను అదానీ ఉల్లంఘించినట్లు సివిల్‌ కేసు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2023 నాటి హిండెన్‌బర్గ్‌ నివేదికను కూడా పత్రిక ప్రస్తావించింది. అదానీ గ్రూప్‌ అనుమానాస్పద విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు పెట్టించడం ద్వారా తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకుందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. దీనిపై సెబీ దర్యాప్తు చేసి రెండింటిని తోసిపుచ్చింది. మరికొన్ని ఆరోపణలపై సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. వీటికితోడు 2014లో మోదీ ప్రచారానికి అదానీ ప్రైవేట్‌ జెట్‌ను వాడుకున్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. దీనికితోడు అదానీ గ్రూప్‌ సంస్థల్లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని వివిధ సంస్థలు ఇచ్చిన నివేదికలను తన కథనంలో ప్రస్తావించింది.

తప్పుడు వార్త: ఎల్‌ఐసీఙ

వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనాన్ని ఎల్‌ఐసీ ఖండించింది. తమ పెట్టుబడి నిర్ణయాలను ఎవరూ ప్రభావితం చేయలేదని, తాము స్వతంత్రంగానే, తమ విధివిధానాలకు లోబడి నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. తమ నిర్ణయాల్లో ఆర్థిక శాఖ కానీ ఇతర ఏ సంస్థల జోక్యం లేదని స్పష్టం చేసింది. 3.9 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదన పత్రం ఏమీ కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌, ఎల్‌ఐసీల మధ్య చర్చకు రాలేదని చెప్పింది. 41 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్‌ఐసీ 351 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. దాని మొత్తం పెట్టుబడుల్లో అదానీలో పెట్టిన మొత్తం రెండు శాతం మాత్రమే. ఇండియాలో 500 అగ్రశ్రేణి కంపెనీల విలువ గత పదేళ్లలో పది రెట్లు పెరిగిందని గుర్తు చేసింది.

Updated Date - Oct 26 , 2025 | 06:01 AM