Share News

CJI in Supreme Court: సీజేఐపై బూటు విసరబోయిన లాయర్‌!

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:25 AM

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కోర్టు హాలులో సోమవారం దిగ్ర్భాంతికర సంఘటన జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్‌ గవాయ్‌ బెంచ్‌ మీదకు బూటు విసరబోయారు......

CJI in Supreme Court: సీజేఐపై బూటు విసరబోయిన లాయర్‌!

  • సుప్రీం కోర్టు హాల్లో దిగ్ర్భాంతికర ఘటన.. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది

  • సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితుడు రాకేశ్‌ కిశోర్‌ నినాదాలు

  • విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలపై నిరసన.. లాయర్‌ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు

  • దాడియత్నంపై చలించని జస్టిస్‌ గవాయ్‌.. విచారణలు కొనసాగించిన జడ్జిలు.. నిందితుడిపై కేసుకు సుప్రీంకోర్టు నిరాకరణ

  • 3 గంటల తర్వాత నిందితుడి విడుదల.. బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు.. దేశంలో ఎక్కడా వాదించకుండా చర్యలు

  • దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఖర్గే, సోనియా, రేవంత్‌, పవార్‌, పినరయి.. గవాయ్‌కు ఫోన్‌లో మోదీ పరామర్శ

న్యూఢిల్లీ, అక్టోబరు 6: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ కోర్టు హాలులో సోమవారం దిగ్ర్భాంతికర సంఘటన జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్‌ గవాయ్‌ బెంచ్‌ మీదకు బూటు విసరబోయారు. అయితే, పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది విజయవంతంగా బూటు బెంచ్‌ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జస్టిస్‌ గవాయ్‌ చలించలేదు. ‘‘మీరు పట్టించుకోమాకండి. మేం పట్టించుకోం. ఇలాంటి సంఘటనలు నన్ను ప్రభావితం చేయలేవు. మీ పని కానివ్వండి’’ అని న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు. ఉదయం 11.35కు జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ల ధర్మాసనం ముందు సీనియర్‌ న్యాయవాదులు అత్యవసర కేసులను ప్రస్తావిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీలోని మయూర్‌ విహార్‌కు చెందిన న్యాయవాది రాకేశ్‌ కిశోర్‌ సుప్రీంకోర్టు బార్‌లో సభ్యుడు.


ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్న ఒకటో నంబరు కోర్టు హాలులో న్యాయవాద దుస్తుల్లో వచ్చారు. నేరుగా ఎడమ వైపు నుంచి ప్రధాన న్యాయమూర్తి వేదిక దగ్గరకు వచ్చారు. కిందకు వంగి తన బూటు తీశారు. దాంతోపాటు కొన్ని కాగితాలను రోల్‌ లాగా చుట్టి గవాయ్‌ బెంచ్‌ దిశగా విసిరేశారు. ఆ సమయంలో ఇద్దరు జడ్జిలు కుడివైపు తిరిగి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. అతను బూటు విసురుతుండగానే భద్రతా సిబ్బంది స్పందించి, అడ్డుకున్నారు. వెంటనే అతన్ని బయటకు తీసుకెళ్లారు. ‘‘సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు’’ అంటూ వృద్ధ న్యాయవాది నినాదాలు చేశారు. బూటుతో పాటు రోల్‌ చేసిన కాగితాలు కూడా విసరడంతో ఏం విసిరాడో కూడా అక్కడున్న వాళ్లకు కాసేపటి వరకు అర్థం కాలేదు. పోలీసులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. న్యాయవాది చర్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, సదరు న్యాయవాదిపై ఎలాంటి కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అంగీకరించక పోవడంతో 3గంటల విచారణ తర్వాత పోలీసులు అతన్ని వదిలేశారు. ఆయన బూటును, ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా తిరిగి ఇచ్చేశారు. రాకేశ్‌ కిశోర్‌ తెల్ల కాగితం మీద ‘‘ప్రతీ సనాతన వాదికి నా సందేశం. సనాతన ధర్మానికి అవమానం జరిగితే హిందుస్థాన్‌ సహించదు’’ అని రాసుకున్నారు.


జస్టిస్‌ గవాయ్‌ వ్యాఖ్యలపై కోపంతోనే..

మధ్యప్రదేశ్‌లోని ఖుజరహోలోని జవారీ ఆలయంలో మొఘలుల కాలంలో ధ్వంసం చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న పిటిషన్‌పై ఇటీవల జస్టిస్‌ గవాయ్‌ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అది వారసత్వ కట్టడం కావడంతో దానికి మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ కేసు విచారణ సమయంలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పదేపదే పట్టుబట్టడంతో మీరు పరమ భక్తులంటున్నారు కదా, మీరే విష్ణుమూర్తిని వేడుకోండి అని ఆగ్రహంతో జస్టిస్‌ గవాయ్‌ స్పందించారు. అది ప్రజాహిత వ్యాజ్యం కాదు పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అన్నారు. మర్నాడు సీజేఐ తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను సోషల్‌ మీడియా వక్రీకరించిందని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ సంఘటనపై మాట్లాడుతూ, ‘‘ప్రధాన న్యాయమూర్తి తనపై దాడి యత్నం మీద మానవత్వంతో స్పందించారు. దీన్ని న్యాయవ్యవస్థ బలహీనతగా భావించరాదు’’ అన్నారు. ఒక వ్యక్తి తుచ్ఛమైన ప్రచారం కోసం ఇలాంటి చర్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీజేఐకి జెడ్‌ ప్లస్‌ భద్రత ఉంది. ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పు విసరబోయిన న్యాయవాదిని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యత్వం నుంచి తాత్కాలికంగా తొలగించింది. తదుపరి నిర్ణయం తీసుకొనే వరకు ఆయన దేశంలో ఏ కోర్టులోనూ వాదనలు వినిపించే అవకాశం లేదు. గవాయ్‌పై దాడి యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ సంఘం ఖండించింది. ఆయనపై సుప్రీంకోర్టు సుమోటో చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది న్యాయవ్యవస్థపై, చట్టబద్ధ పాలనపై జరిగిన దాడిగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడియత్నాన్ని ఖండించడానికి ఏ మాటలూ చాలవని కాంగ్రెస్‌ ముఖ్యనేత సోనియాగాంధీ అన్నారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఘటనకు బీజేపీ బాధ్యత వహించాలని కేసీవేణుగోపాల్‌ అన్నారు. ఆటగాడికి ఒంటిమీద గీతపడ్డా ట్విట్టర్‌లో స్పందించే ప్రధానికి జస్టిస్‌ గవాయ్‌ మీద దాడి కనబడలేదా? అని పవన్‌ ఖేరా అడిగారు. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ జస్టిస్‌ గవాయ్‌కు ఫోన్‌ చేసి పరామర్శించారు. జస్టిస్‌ గవాయ్‌పై దాడి దేశంలోని ప్రతీ పౌరుడిని ఆగ్రహానికి గురి చేసిందన్నారు.

21.jpg

Updated Date - Oct 07 , 2025 | 02:25 AM