Share News

Hafiz Saeed - Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:42 AM

కశ్మీర్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్ర దాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఉన్నట్టు తెలుస్తోంది. 26/11 దాడుకులకు కారణమైన హఫీజ్ ఈ ఉగ్రబృందాలను నేరుగా పర్యవేక్షించి ఉండొచ్చని సమాచారం.

Hafiz Saeed - Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి వెనక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్
Lashkar Chief Hafiz Saeed's in Pahalgam Attack

ఇంటర్నెట్ డెస్క్: అందరూ నిరాయుధులు.. సామాన్యులు.. తమను విడిచిపెట్టాలని బతిమలాడినా ఉగ్రమూకలు పట్టించుకోలేదు. తలకు తూపాకీ గురిపెట్టి అత్యంత కర్కశంగా వారిని కడతేర్చారు. కశ్మీర్‌లోని బైసరన్ లోయలో మంగళవారం జరిగిన ఈ దాడి వెనక లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్‌తోపాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా.. ఉగ్రమూకలను అమాయకుల మీద ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఎల్‌ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిక ఉగ్రవాదుల బృందం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లు తోపాటు కశ్మీర్‌లో మద్దతుదారులు మరికొందరు పని చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఎల్‌టీఈ చీఫ్ హఫీజ్ సయీద్ సూచనలతోనే..

పాక్ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 26/11 దారుణానికి కారకుడైన హఫీజ్ సయీద్.. టెరరిస్టులకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించి ఉండొచ్చని సమాచారం. ఎంతోకాలంగా ఈ టెర్రరిస్టు బృందం కశ్మీర్‌ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సోనమార్గ్, బూతాపత్రీ, గండేర్బల్ దాడుల్లో ఈ బృందమే పాలు పంచుకుంది. గత అక్టోబర్‌లో బూతాపత్రిలో జరిగిన దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృతి చెందారు. అదే నెలలో సోనామార్గ్ టెన్నెల్ కార్మికులను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో ఆరుగురు కార్మికులతో పాటు ఓ డాక్టర్ కూడా కన్నుమూశారు.

అయితే, గత డిసెంబర్‌లో ఈ టెరరిస్టు బృందానికి చెందిన జునైద్ అహ్మద్ భట్ అనే లష్కర్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. మిగిలిన వారు ఎలాగోలా తప్పించుకుని, సమీప అడవుల్లోకి పారిపోయారు. భారీ దాడి చేశాక ఈ ఉగ్రమూకలు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థానీ హ్యాండర్ల నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకూ అక్కడి అడవుల్లోనే తలదాచుకుంటారని తెలిపాయి.

తాజా దాడిలో పాల్గొన్న ఊగ్రవాదులు ఎల్‌ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు నియంత్రణలోని వారే అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వీరికి పాక్ మిలిటరీతో పాటు ఐఎస్ఐ నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది ఉండొచ్చని అనుమానిస్తున్నాయి.


దాడి ఇలా..

బైసరన్ లోయలో మూడు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న ఉగ్రమూకలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పోలీసుల కథనాల ప్రకారం, ఓ ప్రాంతంలో ఐదు మందిని, మరో మైదాన ప్రాంతంలో ఇద్దరిని, లోయ సరిహద్దు వద్ద మిగతా వారిని ఉగ్రవాదులు బలితీసుకున్నారు. ఫెన్సింగ్ దాటి పారిపోగలిగిన వారు ఈ దాడి నుంచి తప్పించుకోగలిగారు. మరోవైపు, దాడికి పాల్పడిన వారి రేఖాచిత్రాలను జమ్మూ కశ్మీర్ పోలీసులు విడుదల చేశఆరు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు కాగా మరొకరు స్థానిక అనంత్‌నాగ్ జిల్లా వాస్తవ్యుడు. నిందితుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20 లక్షల నజరానాను కూడా పోలీసులు ప్రకటించారు. సమీప అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్న స్థావరాలను గురువారం భద్రతా దళాలు గుర్తించాయి. వారి జాడ కనిపెట్టేందుకు భద్రతా దళాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

పాకిస్థాన్ క్రీడాకారుడికి ఆహ్వానం పంపడంపై విమర్శలు.. స్పందించిన నీరజ్ చోప్రా

పాక్‌పై భారత్ ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు ఏవంటే..

ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్

Read Latest and National News

Updated Date - Apr 25 , 2025 | 12:41 PM