Share News

TRF: పహల్గాం దాడితో కశ్మీర్‌లో నిరసనల వెల్లువ.. ప్లేటు ఫిరాయించిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:25 PM

పహల్గాం దాడితో కశ్మీర్‌లో ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న వెళ ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ కీలక ప్రకటన చేసింది. ఈ దాడికి తామే బాధ్యులమని తొలుత జెబ్బలు చరుచుకున్న సంస్థ.. తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. తాము దీనికి బాధ్యులము కాదని స్పష్టం చేసింది.

TRF: పహల్గాం దాడితో కశ్మీర్‌లో నిరసనల వెల్లువ.. ప్లేటు ఫిరాయించిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్
Lashkar Affiliate TRF Denies Role in Pahalgam Attack

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడిపై కశ్మీర్‌లో నిరసనలు మిన్నంటాయి. అమాయక టూరిస్టులను బలితీసుకోవడాన్ని కశ్మీర్ సమాజం ముక్త కంఠంతో ఖండించింది. ఈ నేపథ్యంలో లష్కరే తయ్యబా అనుబంధంగా కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద బృందం ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఊహించని యూటర్న్ తీసుకుంది. పహల్గాం దాడి తామే చేశామని తొలుత ఘనంగా ప్రకటించిన టీఆర్ఎఫ్.. తమకు ఆ దాడితో ఏమాత్రం సంబంధం లేదంటూ తాజాగా ప్లేటు ఫిరాయించింది. హ్యాకర్ల కారణంగా ఈ ప్రకటన విడుదలైందని, దీని వెనుక భారత సైబర్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉండొచ్చని కూడా పేర్కొంది.


‘‘పహల్గాం దాడిలో మా పాత్ర అసలేమీ లేదు. దీన్ని మాకు ఆపాదించడం తప్పే కాకుండా తొందర పాటు చర్య అవుతుంది. తొలి ప్రకటనపై మేము అంతర్గత ముదింపు నిర్వహించాము. మా డిజిటల్ వేదికలపై సైబర్ దాడితో ఈ ప్రకటన వెలువడిందని గుర్తించాము. మా అనుమతి లేకుండా విడుదలైన ప్రకటన ఇది. సైబర్ దాడి ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ ప్రారంభించాము. అయితే, ప్రాథమిక ఆధారాలు మాత్రం భారతీయ సైబర్ ఇంటెలిజెన్స్ వర్గాలవైపు చూపిస్తున్నాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వాదనను బలపరిచేందుకు ఓ ఆడియో క్లిప్‌ను కూడా రిలీజ్ చేసింది.


పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టుల హత్యకు తామే కారణంటూ టీఆర్ఎఫ్ తొలుత గర్వంగా ప్రకటించుకున్న విషయం తెలిసిందే. దీంతో, కశ్మీర్‌ ప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. పాకిస్థాన్‌పై, పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలపై స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. 2023లో భారత ప్రభుత్వం టీఆర్‌ఎఫ్‌ను ఉపా చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చొరబాట్లను ప్రోత్సహించడం, మిలిటెంట్లను చేర్చుకోవడం, పాక్ నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ టీఆర్‌ఎఫ్‌ను టెర్రరిస్టు సంస్థగా ప్రకటించింది. మరోవైపు, పహల్గాం దాడి తరువాత ప్రపంచదేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించాయి. భద్రతా మండలి కూడా ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించింది. నిందితులకు శిక్ష పడాల్సిందేనంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందం నిలుపుదల చేయడంతో పాక్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. రాబోయే నీటి ఎద్దడిని ఎలా తట్టుకోవాలో తెలీక అక్కడి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నీటిని ఆపడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Read Latest and International News

Updated Date - Apr 26 , 2025 | 12:33 PM