Bihar Elections: లాలూ కుటుంబానికి షాక్
ABN , Publish Date - Oct 14 , 2025 | 06:10 AM
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుటుంబానికి షాక్ తగిలింది.
ఐఆర్‌సీటీసీ అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు అభియోగాలు
లాలూ, రబ్రీ, తేజస్విపై మోసం, కుట్ర ఆరోపణలు.. బిహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి ఇబ్బందికర పరిస్థితులు
న్యూఢిల్లీ, అక్టోబరు 13: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుటుంబానికి షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ అవినీతి కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవీ, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై సోమవారం ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపింది. బిహార్ అసెంబ్లీకి వచ్చే నెల 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీకి ఇది ఇబ్బందికర పరిస్థితే. రబ్రీదేవి, తేజస్విపై మోసం, కుట్ర అభియోగాలు; లాలూపై అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపినట్లు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి విశాల్ గాగ్నే ప్రకటించారు. రైల్వే మంత్రిగా లాలూ తన పదవిని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. భూముల బదిలీ విషయంలో నిందితులపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని తెలిపారు. అతి తక్కువ ధరకు కేటాయించడంతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. కాగా, తాము ఏ తప్పూ చేయలేదని బిహార్ మాజీ సీఎంలు లాలూ, రబ్రీ; మాజీ డిప్యూటీ సీఎం, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో ఈ నెల చివరి వారంలో వీరిపై విచారణ ప్రారంభం కానుంది. కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో(2004-09) ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందంటూ సీబీఐ 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కాంట్రాక్టులను పట్నాకు చెందిన సుజాత హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దానికి బదులుగా లాలూ ఓ బినామీ కంపెనీ ద్వారా ఖరీదైన ప్రాంతంలో 3 ఎకరాల భూమిని పొందారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ కోర్టు అభియోగాలు మోపడంపై తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ఇదంతా రాజకీయ కక్షతోనే చేశారన్నారు. బిహార్‌లో ఎన్నికలు ఉన్నందునే ఇలా చేశారని ఆరోపించారు. కోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని, ఈ కేసును ఎదుర్కొంటామని చెప్పారు.
ఆర్జేడీ పాలన అంటేనే కుంభకోణాలు: బీజేపీ
ఆర్జేడీ పాలన అంటేనే కుంభకోణాలని బీజేపీ ఆరోపించింది. ఐఆర్‌సీటీసీ అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు లాలూ కుటుంబంపై అభియోగాలు మోపిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. కుంభకోణాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలు, ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రజల భూములు లాక్కోవడం.. లాలూ ప్రసాద్ మోడల్ పరిపాలన అంటే ఇదేనని విమర్శించారు.