Share News

Abhaya Murder: ‘అభయ’ కేసులో దోషి సంజయ్‌ రాయ్‌

ABN , Publish Date - Jan 19 , 2025 | 04:15 AM

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్‌ డాక్టర్‌ ‘అభయ’ దారుణ హత్య కేసుపై శనివారం కోల్‌కతా నగర న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Abhaya Murder: ‘అభయ’ కేసులో దోషి సంజయ్‌ రాయ్‌

జూ. డాక్టర్‌పై హత్యాచారం చేసింది అతడే

ఆర్‌జీ కర్‌ ఘటనపై కోల్‌కతా కోర్టు తీర్పు

రేపు శిక్షను ప్రకటించనున్న న్యాయస్థానం

తీర్పుపై కుటుంబీకులు, మెడికోల అసంతృప్తి

కుట్రపై లోతైన దర్యాప్తునకు డిమాండ్‌

కోల్‌కతా, జనవరి 18: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జూనియర్‌ డాక్టర్‌ ‘అభయ’ దారుణ హత్య కేసుపై శనివారం కోల్‌కతా నగర న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆర్‌జి కర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే ఆమెపై అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసులో అక్కడి పనిచేసే సంజయ్‌ రాయ్‌ దోషి అని ప్రకటించింది. ఇందుకు విధించే శిక్షను సోమవారం వెల్లడించనుంది. 162 రోజుల పాటు రహస్య విచారణ జరిపిన అనంతరం సేల్దాలోని అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి అనిర్బన్‌ దాస్‌ ఈ మేరకు నిర్ణయాన్ని వెలువరించారు. నేర తీవ్రతను పరిశీలిస్తే మరణశిక్షగానీ, యావజ్జీవ కారాగార శిక్షగానీ విధించే అవకాశం ఉంది. గత ఏడాది ఆగస్టు 9న ఆస్పత్రిలో ఆన్‌ డ్యూటీ డాక్టర్‌గా విధులు నిర్వర్తించి రాత్రి సెమినార్‌ హాల్‌లో నిద్రిస్తున్న 31 ఏళ్ల ఆ మెడికోపై వేకువ జాము నాలుగు గంటల సమయంలో సంజయ్‌ రాయ్‌ అత్యాచారం చేసి, అనంతరం గొంతు పిసికి హత్య చేసినట్టు రుజువయిందని జడ్జి తెలిపారు. అతడు సమీప పోలీసు స్టేషన్‌లో ‘సివిక్‌ వాలంటీరు’గా పనిచేసేవాడు. బందోబస్తు నిమిత్తం ఆ ఆస్పత్రిలో నియమించగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడిపై భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లోని సెక్షన్‌ 64 (రేప్‌), 66 (మరణానికి కారణమయినందుకు శిక్ష), సెక్షన్‌ 103(1) (హత్య)ల కింద కేసు నమోదయింది. ఈ అభియోగాలను కేసు దర్యాప్తు చేసిన సీబీఐ నిరూపించిందని జడ్జి తెలిపారు. ముద్దాయి తన వాదనను వినిపించేందుకు సోమవారం ఉదయం 12.30 గంటలకు అవకాశం ఇస్తారు. తర్వాత తీర్పు ప్రకటిస్తారు.


నేను నేరం చేయలేదు

తాను ఎలాంటి నేరం చేయలేదని రాయ్‌ విచారణ సందర్భంగా చెప్పాడు. ‘‘నేను రుద్రాక్ష మాల ధరిస్తాను. ఒక వేళ నేరం చేసి ఉంటే ఆ మాల తెగి పడిపోయి ఉండేది కదా! పవిత్ర రుద్రాక్షలు ఽధరించి అలంటి నేరం చేయగలనా?’’ అని వాదించాడు. ఆ వాదనతో జడ్జి ఏకీభవించలేదు. కోర్టుకు కూడా రుద్రాక్ష మాల వేసుకొని, కాషాయం కోటు ధరించి వచ్చాడు. ఈ దారుణానికి నిరసనగా కోల్‌కతా నగరంలో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. బాధితురాలిని కొందరు ‘అభయ’, ఇంకొందరు ‘తిలోత్తమ’ అని పిలుచుకొని ప్లకార్డులు, కొవ్వొత్తులు పట్టుకొని నిరసనలు తెలిపారు. ఈ తీర్పును బాధితురాలి తల్లిందండ్రులు స్వాగతించినా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఆమె తల్లి మాట్లాడుతూ ‘‘సంజయ్‌ రాయ్‌ దోషి అని నిరూపితమయింది. అయితే అతడొక్కడే నేరస్తుడు కాదు. మిగిలిన వారిని కూడా చట్టం ముందు నిలబెట్టాలి. ఇందుకోసం తుది శ్వాస వరకు పోరాడుతాం’’ అని చెప్పారు. ఈ దుర్ఘటనపై ఆందోళన చేసి దేశం దృష్టిని ఆకర్షించిన జూనియర్‌ డాక్టర్లు.. దీని వెనుక ఉన్న కుట్రపై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని కోరారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉందని ఓ జూనియర్‌ డాక్టర్‌ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల పాత్రపై దర్యాప్తు జరగాల్సి ఉందని అన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు సువేందు అధికారి మాట్లాడుతూ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌, కలకత్తా మాజీ పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌లకు కూడా ప్రస్తుతం శిక్ష పడి ఉంటే బాగుండేదని చెప్పారు.

Updated Date - Jan 19 , 2025 | 04:18 AM