Kishtwar Cloudburst Tragedy: జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ .. 60కి చేరిన మృతుల సంఖ్య
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:44 PM
Kishtwar Cloudburst Tragedy: చోసితి గ్రామంలో ఎటుచూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. హఠాత్తుగా వచ్చిన వరదలకు దాదాపు గ్రామమంతా తుడిచిపెట్టుకుపోయింది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.
జమ్మూకాశ్మీర్‌లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ పెను విషాదం మిగిల్సిన సంగతి తెలిసిందే. క్లౌబ్ బరస్ట్ కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు పోగొట్టుకోగా.. దాదాపు 200 మంది గల్లంతు అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మృతుల సంఖ్య 46 నుంచి 60కి చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆర్మీ కూడా సహాయక చర్యల్లో భాగమైంది. ఇప్పటి వరకు 160 మందిని రక్షించినట్లు తెలుస్తోంది.
ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని మోదీ ఫోన్ కాల్
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో క్లౌడ్ బరస్ట్ విషాదంపై ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనంత సాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఇప్పుడే ప్రధాని నరేంద్ర మోదీనుంచి నాకు కాల్ వచ్చింది. కిస్త్‌వార్‌లోని పరిస్థితుల గురించి ఆయనకు వివరించి చెప్పాను. అధికారులు తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాను. ఆయన మద్దతు, సాయానికి మా ప్రభుత్వం, బాధిత ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు’ అని పేర్కొన్నారు.
భక్తులే బాధితులు
దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కిస్త్‌వార్‌లోని మాచైల్ మాత ఆలయానికి వస్తూ ఉంటారు. యాత్రకు వెళ్లే వారికి చషోటి గ్రామమే బేస్ పాయింట్. ఇక్కడ యాత్రికుల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేస్తారు. భక్తులు ఇక్కడే వాహనాలు వదిలి, కాలినడకన మాచైల్ మాత గుడికి వెళతారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలు, వసతి సౌకర్యాలు, సెక్యూరిటీ అవుట్ పోస్టులన్నీ కొట్టుకుపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
ఇవి కూడా చదవండి
ఎర్రకోటకు వెళ్లని రాహుల్, ఖర్గే.. కారణం ఇదేనా?..
దేశ్ రంగీల పాటకు రిహార్సల్స్.. డ్యాన్స్ అదరగొట్టిన ఉపాధ్యాయుడు