Road Repairs In Bengaluru: సొంత ఖర్చుతో రోడ్లను బాగు చేసేందుకు సిద్ధం
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:00 AM
బెంగళూరు నగర రోడ్ల దుస్థితి, చెత్త దిబ్బలపై ఇటీవల వరుస పోస్టులు పెట్టిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా తాజాగా....
బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ ప్రకటన
బెంగళూరు, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగర రోడ్ల దుస్థితి, చెత్త దిబ్బలపై ఇటీవల వరుస పోస్టులు పెట్టిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా తాజాగా సొంత డబ్బుతో 15 రోడ్లను బాగు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతు, నిర్వహణ ఖర్చులు భరిస్తానని ఆమె ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకా హెబ్బగూడి గ్రామ పంచాయతీలో బయోకాన్ సంస్థ కార్యాలయం ఉంది. ఆ ప్రాంతంలోని సుమారు 13-15 రోడ్లను బాగు చేసేందుకు వివిధ శాఖల అధికారులతో బయోకాన్ సంస్థ అధికారులు చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే ఏయే రోడ్లను బాగు చేస్తారనేది ఇంకా నిర్ధారించలేదు. ఈ విషయమై బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి, డీసీఎం డీకే శివకుమార్ శనివారం స్పందించారు. కేఆర్‌పురలో ‘బెంగళూరు నడక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘రోడ్ల అభివృద్ధికి ఆమె (కిరణ్ మజుందార్‌షా) ముందుకొస్తే అప్పగిస్తాం’ అని అన్నారు. ఇక్కడి ప్రజలు అధికంగా పన్నులు కడుతున్నారని, ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. పౌరులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. తనను కలుసుకోలేని వారు 1533 నంబరుకు కాల్ చేసి సమస్యలు చెప్పవచ్చని శివకుమార్ సూచించారు.