Kharge: ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:40 AM
రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం దుమారం రేగింది. డిప్యూటీ చైర్మన్‌ను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాత్రమే చేశానని వివరణ ఇచ్చిన ఖర్గే.. డిప్యూటీ చైర్మన్‌కు క్షమాపణ చెప్పారు.

చైర్మన్‌ను అవమానించారంటూ అధికారపక్షం ధ్వజం
న్యూఢిల్లీ, మార్చి 11: రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మంగళవారం దుమారం రేగింది. డిప్యూటీ చైర్మన్‌ను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాత్రమే చేశానని వివరణ ఇచ్చిన ఖర్గే.. డిప్యూటీ చైర్మన్‌కు క్షమాపణ చెప్పారు. ప్రశ్నోత్తరాల అనంతరం జాతీయ విద్యా విధానంపై కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సూచించారు. ఆ సమయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకుగాను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలంటూ పలువురు ప్రతిపక్ష సభ్యులు నిల్చొని డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో జోక్యం చేసుకునేందుకు ఖర్గే లేచి నిల్చున్నారు.
అయితే, ఖర్గేకు ఉదయమే మాట్లాడే అవకాశం ఇచ్చామని, ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేయగా, తాను మాట్లాడిన సమయంలో విద్యాశాఖ మంత్రి సభలో లేరన్న ఖర్గే.. ‘ఇది నియంతృత్వం’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘అనాగరికులు, సంస్కృతి లేనివారంటూ దేశంలోని ఒక ప్రాంతం, ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు కించపరుస్తున్నారు. దేశాన్ని ముక్కలు చేసేలా మాట్లాడుతున్నారు. మంత్రి రాజీనామా చేయాలి’ అని ఖర్గే డిమాండ్ చేశారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమైందనేలా ఖర్గే హిందీలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సభాధ్యక్షుడి గురించి ఖర్గే అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అధికార పక్షం ఆందోళనకు దిగింది. ఖర్గే వ్యాఖ్యలు ఖండించదగినవని సభాపక్ష నేత జేపీ నడ్డా అన్నారు. దీంతో ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పారు.