Key Twist in Dharmasthala Controversy: ధర్మస్థల వివాదంలో కీలక మలుపు
ABN , Publish Date - Aug 19 , 2025 | 02:48 AM
ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేసిన మాజీ పౌర కార్మికుడు సిట్ ఎదుట...ఫిర్యాదు వెనుక కొందరి ప్రోత్సాహం ఉందని...
ఫిర్యాదు వెనుక ఇతరుల ప్రోత్సాహం?
చట్టవిరుద్ధంగా మృతదేహాలు పాతిపెట్టినట్టు చెప్పాలని ఒత్తిడి
సిట్ ఎదుట మాజీ కార్మికుడి వెల్లడి!
బెంగళూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్టు ఫిర్యాదు చేసిన మాజీ పౌర కార్మికుడు సిట్ ఎదుట...ఫిర్యాదు వెనుక కొందరి ప్రోత్సాహం ఉందని, పుర్రెను కూడా వారే సమకూర్చారని చెప్పినట్టు తెలిసింది. మాజీ పౌరకార్మికుడు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అతను చూపించిన అటవీప్రాంతంలో 15 రోజులపాటు తవ్వకాలు జరిపారు. శనివారం నుంచి తవ్వకాలకు బ్రేక్ పెట్టిన సిట్ అధికారులు ఫిర్యాదుదారుడిని సోమవారం విచారించారు. విచారణలో ఫిర్యాదుదారుడు.. తాను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో కుటుంబంతో పాటు ఉన్నానని, ఆ తర్వాత ఓ బృందం తనను సంప్రదించి, ధర్మస్థలలో మృతదేహాలు పాతిపెట్టిన అంశం గురించి వివరాలు కోరిందని చెప్పాడు. చట్టప్రకారమే మృతదేహాలను పూడ్చానని వారికి మాజీ పౌర కార్మికుడు తెలిపాడు. కానీ చట్ట విరుద్ధంగా వాటిని పాతిపెట్టినట్లు చెప్పాలని 2023 డిసెంబరు నుంచి ఆ బృందం ఒత్తిడి తెచ్చింది. ఆ తరువాత అదే బృందం మాజీ పౌర కార్మికుడిని కర్ణాటకకు తీసుకొచ్చింది. ఆ బృందమే ఓ పుర్రెను సమకూర్చింది. ఆ పుర్రెను తీసుకువెళ్లి కార్మికుడు.. చట్టవిరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల ముందు ఏం చెప్పాలనేది ప్రతిరోజూ అతనికి ముగ్గురు సలహాలు ఇచ్చేవారు. అంతా వారు చెప్పినట్లే చేశానని సిట్‌కు మాజీ పౌర కార్మికుడు వివరించినట్టు సమాచారం. సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు చెప్పిన అంశాలను రికార్డు చేసినట్టు తెలిసింది. కానీ ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ వ్యవహారం సోమవారం కర్ణాటక అసెంబ్లీలో రచ్చకు దారితీసింది.