Share News

Karnataka EC Issues Notice to Rahul Gandhi: ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:57 AM

బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో

Karnataka EC Issues Notice to Rahul Gandhi: ఆరోపణలపై ఆధారాలు ఇవ్వండి

  • రాహుల్‌కు కర్ణాటక ఈసీ నోటీసులు

బెంగళూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ స్థానంలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ‘ఓట్ల చోరీ’ జరిగిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించారు. రాహుల్‌కు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 7న ఢిల్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌లో చేసిన ఆరోపణలకు సంబంధించిన తగిన వివరాలను డాక్యుమెంట్ల రూపంలో ఇవ్వాలని సూచించారు. ఆధారాలు సమర్పిస్తే సమగ్ర దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. పీపీటీలో చూపిన డాక్యుమెంట్లు కేంద్ర ఎన్నికల సంఘం రికార్డుల నుంచి తీసుకున్నవని, పోలింగ్‌ బూత్‌ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శకున్‌రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేసినట్లు ఆరోపించారని పేర్కొన్నారు. అది కూడా ఒకే ఐడీ కార్డుతో రెండుసార్లు ఓటు వేశారన్నారు. శకున్‌రాణిని విచారిస్తే ఆమె ఒకసారి మాత్రమే ఓటు వేసినట్లు తెలిపారని ఎన్నికల అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో శకున్‌ రాణి లేదా మరెవరైనా రెండుసార్లు ఓటేశారని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమర్పించాలని కోరారు. సీఈవో కార్యాలయం చేపట్టిన ప్రాథమిక విచారణలో అసలు రాహుల్‌ ప్రజంటేషన్‌ సమయంలో చూపిన టిక్‌ మార్క్‌ చేసిన డాక్యుమెంట్‌ను ఎన్నికల అధికారి జారీచేయలేదని పేర్కొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 02:57 AM