Kannada Director Sangeeth Sagar: షూటింగ్ చేస్తుండగా విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:16 PM
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. షూటింగ్ సందర్భంగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పాత్రధారి’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం కొప్పలో షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అనుకోని విషాదం చోటుచేసుకుంది. సంగీత్ సాగర్ ఉన్నట్టుండి గుండె పోటుకు గురయ్యారు. ఇది గుర్తించిన సిబ్బంది వెంటనే ఆయన్ని కొప్ప ఆస్పత్రికి తరలించారు. సంగీత్ సాగర్ అరోగ్య పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు సివమొగ్గకు రిఫర్ చేశారు. కుటుంబసభ్యులు ఆయన్ని సివమొగ్గ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి వైద్యులు సాగర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఆయన్ని బతికించటానికి ఎంతో ప్రయత్నించారు. అయినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సంగీత్ సాగర్ కన్నుమూశారు. సాగర్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన అకాల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ కుటుంబానికి తమ సానుభూతి తెలియజేస్తున్నారు.
కాగా, సంగీత్ సాగర్ దొడ్డనగరలో జన్మించారు. సినిమాల మీద ఆసక్తితో బెంగళూరు వచ్చారు. దర్శకుడిగా ఇప్పటి వరకు 8 సినిమాలు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం‘పాత్రధారి’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ గత 20 రోజులుగా తీర్థహళ్లి, హరహరపుర చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. రేపు సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఆయన గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.
ఇవి కూడా చదవండి
రష్యా అధ్యక్షుడికి స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ.. ప్రైవేట్ డిన్నర్..
అమరావతి పనులపై జగన్‌కు అవగాహన లేదు.. మంత్రి నారాయణ ఫైర్