Share News

Kamal Haasan: తమిళం నుంచి కన్నడ పుట్టింది

ABN , Publish Date - May 29 , 2025 | 05:37 AM

సినిమా కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ‘తమిళం నుంచి కన్నడ పుట్టింది’ అని చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. తమ భాషను తక్కువ చేశారంటూ కమల్‌పై కన్నడిగులు మండిపడుతున్నారు.

Kamal Haasan: తమిళం నుంచి కన్నడ పుట్టింది

  • కమల్‌హాసన్‌ వ్యాఖ్య.. కన్నడిగుల మండిపాటు

చెన్నై, మే 28 (ఆంధ్రజ్యోతి): సినిమా కార్యక్రమంలో ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ ‘తమిళం నుంచి కన్నడ పుట్టింది’ అని చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. తమ భాషను తక్కువ చేశారంటూ కమల్‌పై కన్నడిగులు మండిపడుతున్నారు. త్వరలో విడుదల కాబోయే ఆయన నటించిన సినిమా ‘థగ్‌ లైఫ్‌’ను బ్యాన్‌ చేయాలి అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కమల్‌ వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా స్పందించారు. కన్నడకు ఎంతో ఘన చరిత్ర ఉందని, అది ఆయనకు తెలిసుండదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో చాలాకాలం తర్వాత కమల్‌ హాసన్‌ నటించిన థగ్‌ లైఫ్‌ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమల్‌, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ‘‘కర్నాటకలోని అగ్రనటుడు శివరాజ్‌ కుమార్‌ ఫ్యామిలీ కూడా నా కుటుంబం లాంటిదే. నా కోసమే శివరాజ్‌కుమార్‌ ఈ కార్యక్రమానికి వచ్చారు. తమిళం నుంచి కన్నడం పుట్టింది. అందుకే మీరు (శివరాజ్‌కుమార్‌) ఇక్కడకు వచ్చారు’’ అని పేర్కొన్నారు.


ఈ వ్యాఖ్యలపై కన్నడ నాట విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన క్షమాపణ చెప్పాలంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. కన్నడ రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్‌ షెట్టి స్పందిస్తూ.. ‘మీ చిత్రాలకు కన్నడంలో వ్యాపారం కావాలి.. కానీ, మా భాషను తక్కువ చేసి మాట్లాడతారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తన వ్యాఖ్యలపై వివాదం రేగడంపై కమల్‌ స్పందించారు. ప్రేమతో మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాషల చరిత్ర గురించి తనకు చాలామంది చరిత్రకారులు చెప్పారని, తాను చెప్పిందంతా ప్రేమతోనే చెప్పానని తెలిపారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. తనతో పాటు రాజకీయ నాయకులు ఎవరికీ భాషలపై మాట్లాడే నైపుణ్యం ఉండదన్నారు. భాషలపై లోతుగా చర్చించేందుకు ఆ విషయాన్ని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భాషా నిపుణులకు వదిలివేద్దాం అని కమల్‌ పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2025 | 02:58 PM