Kamal Haasan Inspirational Speech: వైఫల్యాలను ఎదుర్కొని విజయం వైపు సాగండి
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:06 AM
జీవితంలో వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొని విజయం వైపు యువత ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌నీదిమయ్యం అధినేత...
యువతకు కమల్‌హాసన్ పిలుపు
నాస్తికుణ్ణి కాదు... హేతువాదినంటూ వ్యాఖ్య
ఘనంగా వీఐటీ-చెన్నై వార్షికోత్సవం
చెన్నై, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జీవితంలో వైఫల్యాలను ధైర్యంగా ఎదుర్కొని విజయం వైపు యువత ముందుకు సాగాలని ప్రముఖ సినీ నటుడు, ‘మక్కల్‌నీదిమయ్యం’ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ పిలుపునిచ్చారు. ‘వీఐటీ-చెన్నై’ 15వ వార్షికోత్సవం సందర్భంగా ‘క్రిస్టల్ కనెక్షన్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళన సమావేశం’ శుక్రవారం స్థానిక కేలంబాక్కంలో ఘనంగా జరిగింది. వీఐటీ వ్యవస్థాపక కులపతి జి.విశ్వనాథన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం స్వాగతం పలకగా, కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ మాట్లాడుతూ.. ఏ ఆవిష్కరణ కూడా ఫెయిల్యూర్ లేకుండా సాధ్యం కాదని, వైఫల్యాలకు భయపడే దేశం దాని నిజమైన సామర్థ్యాన్ని ఎప్పటికీ ఆవిష్కరించలేదన్నారు. ‘దేవుడంటే గౌరవం లేదు కానీ, తమిళాన్ని మాత్రం గౌరవిస్తారు’ అని కొంతమంది తనను ప్రశ్నిస్తుంటారని అంటూ.. ‘నిజమే, తమిళం నా మాతృభాష. భాష మాత్రమే గౌరవించదగినది’ అని వ్యాఖ్యానించారు. తాను నాస్తికుణ్ని కాదని, హేతువాదిని మాత్రమేనన్నారు. వీఐటీ ఛాన్స్‌లర్ జి.విశ్వనాధన్ మాట్లాడుతూ.. ఉన్నత విద్య మాత్రమే భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలదని తాను బలీయంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ పట్టుదలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీఐటీ ఉపాధ్యక్షులు డాక్టర్ జీవీ సెల్వం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉద్యోగాల కోసం అన్వేషించడం కంటే వ్యవస్థాపకులుగా మారి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు అక్కడ నేర్చుకుని, బాగా సంపాదించి, తిరిగొచ్చి మాతృదేశానికి సేవ చేయాలని సూచించారు. కార్యక్రమంలో అల్యుమిని ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. వీఐటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ వీఎస్ కాంచన భాస్కరన్, ప్రొ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ టి.త్యాగరాజన్, వీఐటీ చెన్నై డైరెక్టర్ డాక్టర్ కె.సత్యనారాయణన్, అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ పీకే మనోహరన్, వీఐటీఏఏ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్‌కుమార్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.