Share News

భారత అండర్‌కవర్‌ ఏజెంట్ల వివరాలపై..జ్యోతి ద్వారా పాక్‌ ఆరా

ABN , Publish Date - May 21 , 2025 | 07:22 AM

పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించేందుకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఆమె పాక్‌ పర్యటనలు, వాట్సాప్ చాట్ల ఆధారంగా గూఢచర్యం కేసులో విచారణ కొనసాగుతోంది.

భారత అండర్‌కవర్‌ ఏజెంట్ల వివరాలపై..జ్యోతి ద్వారా పాక్‌ ఆరా

న్యూఢిల్లీ, మే 20: భారతదేశానికి చెందిన అండర్‌ కవర్‌ ఏజెంట్లను గుర్తించేందుకు పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ.. యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను ఉపయోగించుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గూఢచర్యం కేసులో అరెస్టయి ఐదురోజుల పోలీసు కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాను.. ఎన్‌ఐఏ, ఐబీ, హరియాణా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగా ఆమె ఫోన్‌లో వాట్సాప్‌ చాట్లను పరిశీలించగా... భారతదేశం నిర్వహించే అండర్‌కవర్‌ ఆపరేషన్లపై ఆమె అలీ హసన్‌ అనే ఐఎ్‌సఐ హ్యాండ్లర్‌తో సంకేత భాషలో చాట్‌ చేసినట్టు వెల్లడైంది. ఆమె అట్టారీ సరిహద్దు సందర్శనకు వెళ్లినప్పుడు.. ‘‘అక్కడ ఎవరైనా అండర్‌ కవర్‌ ఏజెంట్లకు ప్రత్యేక ప్రోటోకాల్‌ అమలుచేస్తున్నట్టు గమనించావా?’’ అని అలీ హసన్‌ ఒక చాట్‌లో ఆమెను ప్రశ్నించినట్టు, అలాంటిదేదీ తాను గమనించలేదని ఆమె సమాధానమిచ్చినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కాగా.. దర్యాప్తులో భాగంగా తాము అడుగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేస్తోందని, తమను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేస్తోందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కాగా, 2014 మే 17న వైశాఖీ పండుగకు పాకిస్థాన్‌ వెళ్లిన జ్యోతి.. 10రోజుల వేడుకలు ముగిశాక కూడా మరో 20 రోజులపాటు అక్కడే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2023 ఏప్రిల్‌లో మరోసారి.. 2024 లో మూడోసారి ఆమె పాకిస్థాన్‌లో పర్యటించింది. అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చాక ఆమె చైనా వెళ్లింది. ఆ ట్రిప్‌ను కూడా పాకిస్థానీ అధికారులే ఏర్పాటు చేశారా అనే అంశంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె డైరీలో 11 పేజీల్లో ఆమె పాక్‌ పర్యటనల గురించి రాసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - May 21 , 2025 | 07:23 AM