Justice Varma: అన్ని నోట్ల కట్టలు బయటపడ్డా జస్టిస్ వర్మ ఫిర్యాదు చేయలేదు: సుప్రీం కోర్టు ప్యానెల్
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:37 PM
తన అధికారిక నివాసంలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ వర్మ వాదనను సుప్రీం కోర్టు ప్యానెల్ తిరస్కరించింది. అంత నగదు బయటపడ్డా ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించినట్టు తెలిసింది.
ఇంటర్నెట్ డెస్క్: జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) వ్యవహారంపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ ఆయన వాదనలను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో జస్టిస్ వర్మ తీరు అనుమానాస్పదంగా ఉందని అభిప్రాయపడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో భారీగా కాలిన కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
భారీ స్థాయిలో కరెన్సీ నోట్ల కట్టలు ప్రత్యక్ష సాక్షుల కంటపడినా కూడా జస్టిస్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయలేదని కమిటీ తేల్చింది. కనీసం జ్యుడీషియల్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ వ్యవహారంలో వర్మ ప్రవర్తన అసహజంగా ఉందని, ఆయనను తొలగించేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్నాయని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
జస్టిస్ వర్మ కుమార్తె సహా 55 మంది సాక్షులను సుప్రీం కోర్టు కమిటీ తన విచారణలో భాగంగా ప్రశ్నించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వాంగ్మూలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. గదిలో కాలిన నోట్ల కట్టల తాలూకు వీడియోలు, ఫొటోలను కూడా పరిశీలించింది. ‘అంత భారీ స్థాయిలో నోట్ల కట్టలను చూసి షాకయ్యా. ఇలాంటిది నా జన్మలో ఎప్పుడూ చూడలేదు’ అని ఓ సాక్షి సుప్రీం కోర్టు ప్యానల్‌కు తెలిపినట్టు సమాచారం. ఈ విషయంపై తమకు ఎలాంటి అవగాహన లేదని జస్టిస్ వర్మ చెప్పడం నమ్మశక్యంగా లేదని కమిటీ అభిప్రాయపడింది.
తన ప్రతిష్ఠను దిగజార్చే కుట్ర జరిగిందన్న జస్టిస్ వర్మ వాదనను కూడా కమిటీ తిరస్కరించింది. ‘కుట్ర కోణం ఉన్నట్టైతే ఆయన ఫిర్యాదు ఎందుకు చేయలేదు. కనీసం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కో లేదా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికో ఎందుకు సమాచారం ఇవ్వలేదు’ అని ప్రశ్నించినట్టు తెలిసింది. నగదు లభించిన స్టోర్ రూమ్‌లోకి ఎవరు వెళ్లాలనేది పూర్తిగా జస్టిస్ వర్మ, ఆయన కుటుంబసభ్యులే నిర్ణయించే వారని కూడా పేర్కొంది. ఘటనకు సంబంధించి ఆధారాల ధ్వంసంలో జస్టిస్ వర్మ కుమార్తె, ప్రైవేటు సెక్రెటరీల పాత్ర ఉండే అవకాశం కూడా ఉందని అభిప్రాయపడింది.
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో మార్చి 14న అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో అక్కడి స్టోర్ రూమ్‌లో భారీగా కాలిన కరెన్సీ నోట్లు బయటపడటం సంచలనం కలిగించింది. జస్టిస్ వర్మపై ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీం కోర్టు స్వయంగా రంగంలోకి దిగింది. మార్చి 28న సుప్రీం కోర్టు కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని కూడా సిఫారసు చేసింది. ఘటనపై విచారణ కోసం ముగ్గురు సుప్రీం న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానానికి కేంద్రం సిద్ధం అవుతున్నట్టు కూడా ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
రంగంలోకి కేంద్రం.. ఇరాన్ నుంచి భారత్‌కు 110 మంది విద్యార్థుల తరలింపు
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో నిర్మాణాలపై కేంద్రం నజర్.. నిబంధనలు కఠినతరం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి