Share News

Junk Conten: జంక్‌తో.. ఏఐ బుర్రలోనూ మట్టే

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:06 AM

జంక్‌ ఫుడ్‌ అతిగా తింటే అది క్రమంగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో జంక్‌ కంటెంట్‌.....

Junk Conten: జంక్‌తో.. ఏఐ బుర్రలోనూ మట్టే

  • ఇంటర్నెట్‌లోని చెత్త కంటెంట్‌తో ఏఐల్లో ‘బ్రెయిన్‌ రాట్‌’

  • తగ్గుతున్న విశ్లేషణ, అధ్యయన సామర్థ్యం

  • ఏఐల ప్రవర్తనలోనూ విపరీత ధోరణి

  • టెక్సాస్‌, పర్డ్యూ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 25 : జంక్‌ ఫుడ్‌ అతిగా తింటే అది క్రమంగా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో జంక్‌ కంటెంట్‌.. పిచ్చిపిచ్చి థంబ్‌నైల్స్‌తో యూట్యూబ్‌లో ఉండే నాణ్యమైన సమాచారం లేని వీడియోలు, మొబైల్‌ స్ర్కీన్‌ను స్ర్కోల్‌ చేస్తూ ఎవరో సరదా కోసం చేసిన రీల్స్‌, షార్ట్స్‌ చూడడం వల్ల మనిషి ఆలోచన సామర్థ్యం కూడా క్రమంగా తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో సులువుగా దొరికే, ఆకట్టుకునేలా కనిపించే సమాచారంతో ఆ.. చాల్లే అని సరిపెట్టుకుంటే.. ఆలోచన పరిధి, కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనే ఆసక్తి, లోతైన అధ్యయనం, విశ్లేషణ చేసే సామర్థ్యం, ఓపిక తగ్గి మెదడు మొద్దు బారిపోతుంది. ఉన్న మతి కూడా పోతుంది. ఇలాంటి స్థితినే బ్రెయున్‌ రాట్‌ అంటారు. ఈ పరిస్థితి మనుషులకు మాత్రమే పరిమితం కాలేదట. ఏదో ఒక రోజు మనిషిని శాసిస్తుందని అనుకుంటున్న ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)కు కూడా తప్పడం లేదట. ఇంటర్నెట్‌లోని జంక్‌ కంటెంట్‌(నాణ్యత లేని సమాచారం) ఏఐలను బ్రెయిన్‌ రాట్‌కు గురి చేసి వాటి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందట. టెక్సస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సన్‌, పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆన్‌లైన్‌లోని జంక్‌ కంటెంట్‌ చాట్‌ జీపీటీ4, జెమినీ1.5 వంటి ఎల్‌ఎల్‌ఎం(లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌) మోడల్‌ చాట్‌బాట్‌లను బ్రెయిన్‌ రాట్‌కు గురి చేస్తోందని ఆ అధ్యయనంలో తేలింది.


ఏఐ చాట్‌బాట్‌లకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సమాచారం, తక్కువ నాణ్యత కలిగిన ఎక్స్‌(ట్విటర్‌)లోని పోస్టులను నిత్యం ఫీడ్‌ చేస్తే.. ఏదైనా సమాచారం కోరినప్పుడు ఆయా చాట్‌బాట్‌లు ఇచ్చే ఫలితాలు అంతే తక్కువ స్థాయిలో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఏఐలు పూర్తి సామర్థ్యం మేరకు పని చేయకుండా మొద్దుబారిపోతున్నట్టు కనుగొన్నారు. ఏఐ మోడల్స్‌ విశ్లేషణ సామర్థ్యానికి కొలమానంగా భావించే ఏఆర్‌సీ(అబ్‌స్ట్రాక్షన్‌ అండ్‌ రీజనింగ్‌ కార్పస్‌) బెంచ్‌మార్క్‌ స్కోరు బ్రెయిన్‌ రాట్‌కు గురైన ఏఐ మోడల్స్‌లో 74.9 నుంచి 57.2కు పడిపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. అలాగే, ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యానికి సంబంధించి రూలర్‌ బెంచ్‌మార్క్‌ కూడా 84.4 నుంచి 52.3కి పడిపోయినట్టు కనుగొన్నారు. అంతేకాక, బ్రెయిన్‌ రాట్‌ ఏఐ చాట్‌బాట్‌ల సామర్థ్యాన్ని తగ్గించడమే కాక వాటి స్వభావాన్ని కూడా మార్చేస్తుందట. అసాధారణమైన ప్రవర్తన, విచిత్రంగా, విపరీత ధోరణిలో, వెటకారంగా సమాధానాలు ఇవ్వడం, నార్సిసిజం వంటి లక్షణాలు బ్రెయిన్‌రాట్‌కు గురైన ఏఐ చాట్‌బాట్‌ల్లో కనిపించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక, బ్రెయిన్‌రాట్‌కు గురైన చాట్‌బాట్‌కు మంచి, నాణ్యమైన సమాచారంతో శిక్షణ ఇచ్చినా దాని సామర్థ్యంలో పూర్తిస్థాయిలో పురోగతి కనిపించడం లేదని వాపోయారు. కాగా, ప్రస్తుతం చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఎల్‌ఎల్‌ఎంలు సామాజిక మాధ్యమాల్లో లభిస్తున్న సరైన అధ్యయనం లేని నాసిరకమైన సమాచారాన్నే ఎక్కువుగా తీసుకుంటున్నాయి. దాంతో ఆ చాట్‌బాట్‌లు ఇచ్చే ఫలితాల స్థాయి కూడా అందుకు తగ్గటుగానే ఉంటుంది. దీంతో ఆ చాట్‌బాట్‌లకు నాణ్యమైన సమాచారం చేరేలా చేయడంపై వాటిని అభివృద్ధి చేసే సంస్థలు దృష్టి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు. చాట్‌బాట్‌లు బ్రెయిన్‌రాట్‌కు గురి కాకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గమని చెబుతున్నారు.

Updated Date - Oct 26 , 2025 | 05:06 AM