Mukesh Chandrakar: అట్టుడికిన బీజాపూర్..
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:36 AM
ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో టీవీ రిపోర్టర్ ముకేశ్ చంద్రాకర్ హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు శనివారం ఆ జిల్లా బంద్ నిర్వహించాయి.
టీవీ రిపోర్టర్ ముకేశ్ హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాల బంద్
ముగ్గురి అరెస్టు.. పరారీలో మరొకరు
చర్ల, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో టీవీ రిపోర్టర్ ముకేశ్ చంద్రాకర్ హత్యకు నిరసనగా జర్నలిస్టు సంఘాలు శనివారం ఆ జిల్లా బంద్ నిర్వహించాయి. హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపాయి. చిరు వ్యాపారులు కూడా బంద్ పాటించి మద్దతు తెలిపారు. ఇటు ముకేశ్ చంద్రాకర్ అంతిమయాత్రలో భారీగా ఆదివాసీలు పాల్గొన్నారు. ఈ కేసులో రితేశ్ చంద్రాకర్, దినేశ్ చంద్రాకర్, మహేంద్ర అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరో నిందితుడు సురేశ్ చంద్రాకర్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ముకేశ్ చంద్రాకర్‌ను ఇంటికి పిలిచి రాడ్‌లతో కొట్టి హత్య చేసి, సెప్టిక్‌ట్యాంక్‌లో పడేశారని వివరించారు. రోడ్డు నిర్మాణ పనులపై వార్తలు కవర్ చేసిన విషయంలో గొడవ జరిగినట్లు అనుమానిస్తున్నామన్నారు. రూ.56 కోట్ల ఓ రోడ్డు పనిని, రూ.120 కోట్లుకు రీటెండర్ చేసిన వ్యవహారంలో ఈ హత్య జరిగిందని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, జర్నలిస్టు ముకేశ్ హత్యను నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో జర్నలిస్టు సంఘాల నాయకులు శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.