Search Operation in J and K: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు.. భారీ సెర్చ్ ఆపరేషన్
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:57 PM
జమ్మూకశ్మీర్‌లోని ఉధమ్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉగ్రవాదులను మట్టుపెట్టే వరకూ ఆపరేషన్ కొనసాగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల సంచారాన్ని గుర్తించిన భద్రతాదళాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఉధమ్‌పూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలోని ఛింగ్లా-బలోతా గ్రామానికి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చి వెళ్లినట్టు అధికారులకు తెలియడంతో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు (Udhampur Search Operation)
నిన్న రాత్రి వేళ ఓ గ్రామస్థుడి ఇంటి తలుపు తట్టిన ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు ఆహారం కావాలని అడిగారు. వారి వాలకంపై సందేహం కలగడంతో భయపడ్డ ఇంటి ఓనర్ అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత భద్రతా దళాలకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించి భారీ స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు అంతుకుముందే సమాచారం అందడంతో అప్రమత్తమైయ్యారు. ఇక రాత్రి వేళ జరిగిన ఘటనతో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం రూఢీ అయ్యింది. దీంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు దిగారు.
భారత్‌లోకి చొరబడే ఉగ్రవాదులు బసంత్‌గఢ్ ప్రాంతం మీదుగా వస్తుంటారని భద్రతా దళాలు తెలిపాయి. ఆ ప్రాంతంలో పర్వతాలు, దట్టమైన అడవుల మాటున భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారు. కథువా సెక్టర్‌లో అంతర్జాతీయ సరిహద్దును దాటి బసంత్‌గఢ్, దోడా, కిష్ట్‌వార్ జిల్లాల మీదుగా కశ్మీర్‌లోయలోకి ప్రవేశిస్తారు. ఉగ్రవాదులకు ఇది ప్రధాన మార్గంగా మారడంతో ఇక్కడ ఇప్పటికే అనేక ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇక తాజా ఘటనలో ఉగ్రవాదులు అడవిలో దాక్కుని ఉంటారని అనుమానిస్తున్న భద్రతా దళాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
స్లీపర్ బస్సులతో యాక్సిడెంట్స్.. రాష్ట్రాలన్నిటికీ ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక సూచనలు
ఎయిర్‌బస్ ఏ320 మోడల్ విమానాల్లో సాంకేతిక లోపం.. 6 వేల వరకూ ఫ్లైట్స్‌పై ప్రభావం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి