Jammu and Kashmir: కశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:39 AM
జమ్ము, కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున మేఘ విస్ఫోటం, కొండ చరియలు విరిగి పడడం కారణంగా ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు
కొండ చరియలు పడి ఏడుగురి మృతి
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు
జమ్ము/శిమ్లా, ఆగస్టు 17: జమ్ము, కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున మేఘ విస్ఫోటం, కొండ చరియలు విరిగి పడడం కారణంగా ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. రాజ్‌బాఘ్, జంగ్‌లోత్ ప్రాంతంలోని జోధ్ ఘాటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.జోధ్ ఘాటి గ్రామంలో మేఘ విస్ఫోటం కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి. జంగ్‌లోత్ ప్రాంతంలో కొండ చరియలు పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని నదుల్లో నీటి ప్రవాహ మట్టం బాగా పెరిగిపోయింది.
ఉజ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జమ్ము, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడడంతో పాటు ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పనర్సా, టకోలి, నాగ్వెయిన్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి బురద చేరింది.