Jaishankar: ట్రంప్ జోక్యం లేదు
ABN , Publish Date - May 23 , 2025 | 04:54 AM
భారత్-పాక్ మధ్య శాంతి ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికంగా జరిగిందని, మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాక్ ఆర్మీ నుంచే కాల్పుల విరమణకు సూచన వచ్చిందని, భారత్ తన డీజీఎంవో ద్వారానే స్పందించిందని తెలిపారు.
కాల్పుల విరమణకు పాకిస్థానే దిగొచ్చింది: జైశంకర్
న్యూఢిల్లీ, మే 22: భారత్, పాక్ మధ్య శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకోవడాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం వెనుక వాస్తవంగా ఏం జరిగిందో ఆయన నెదర్లాండ్స్‌కు చెందిన ఎన్‌వోఎస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ‘రెండు దేశాలు పరస్పరం మాట్లాడుకోవడానికి మాకు హాట్‌లైన్ వ్యవస్థ ఉంది. కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని మే 10న మాకు పాక్ ఆర్మీ నుంచి సందేశం వచ్చింది. దానికి అనుగుణంగా మేం స్పందించాం’ అని జైశంకర్ తెలిపారు. ఉద్రిక్తతల సమయంలో అమెరికాతో సహా అనేక దేశాలు తమతో సంప్రదింపులు జరిపాయని అయితే ద్వైపాక్షిక చర్చలతోనే సమస్య పరిష్కారమైందని ఆయన స్పష్టం చేశారు. ‘అమెరికా.. అమెరికాలోనే ఉంది. ఆ దేశ ఉపాధ్యక్షుడు వాన్స్ మన ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. విదేశాంగ మంత్రి రూబియో నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇతర దేశాల తరహాలోనే వారు పాక్‌తో కూడా సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా కొన్ని గల్ఫ్ దేశాలు కూడా భారత్‌ను సంప్రదించాయి. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు ప్రపంచ దేశాలు వారికి కాల్ చేయడం సాధారణమే. అయితే కాల్పుల విరమణ, సైనిక చర్యలు ఆపేయడం అనేది భారత్, పాక్ మధ్య నేరుగా జరిగిన ఒప్పందం. ఫైరింగ్ ఆగాలని పాకిస్థానీలు కోరుకుంటే దాని గురించి వారే మాకు చెప్పాలి. వారి డీజీఎంవో మా డీజీఎంవోకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాల్సి ఉంటుందని అమెరికాతో పాటు మాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికీ స్పష్టంగా చెప్పాం. చివరకు అదే జరిగింది’ అని జైశంకర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రతి అంశంలో పాక్‌కు వత్తాసు పలుకుతూ వస్తున్న తుర్కియే.. మొదట సీమాంతర ఉగ్రవాదాన్ని వీడాలని పాకిస్థాన్‌కు చెప్పాలని భారత్ స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News