Share News

Delhi Assembly elections: హస్తినలో ‘జైలు’ రాజకీయం!

ABN , Publish Date - Feb 04 , 2025 | 05:17 AM

కరుడుగట్టిన నిజాయితీపరుడినని చెప్పుకొనే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ మద్యం పాలసీ స్కాం కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుడు సిసోదియా కూడా ఇదే కేసులో అరెస్టయి 17 నెలలు జైల్లో ఉన్నారు.

Delhi Assembly elections: హస్తినలో ‘జైలు’ రాజకీయం!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఈ దఫా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జైలు చుట్టూ తిరుగుతున్నాయి. జైలుకు వెళ్లివచ్చిన నేతలు సానుభూతి కోసం పదే పదే తమను అన్యాయంగా కారాగారంలో పడేశారని ప్రచారం చేసుకుంటున్నారు. కరుడుగట్టిన నిజాయితీపరుడినని చెప్పుకొనే ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ మద్యం పాలసీ స్కాం కేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన సన్నిహితుడు సిసోదియా కూడా ఇదే కేసులో అరెస్టయి 17 నెలలు జైల్లో ఉన్నారు. వీరిద్దరి కంటే ముందు నాటి ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ మనీలాండరింగ్‌ చట్టం కేసులో అరెస్టయి ఏడాదిన్నర జైల్లో గడిపారు. ఈ ముగ్గురూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఇక వాయవ్య ఢిల్లీ అల్లర్ల కేసు (2020) నిందితులైన తాహిర్‌ హుస్సేన్‌, షిఫా-ఉర్‌-రహమాన్‌ కూడా జైల్లో ఉండి నామినేషన్లు వేశారు. నిరుడు లోక్‌సభ ఎన్నికలకు ముందు మద్యం పాలసీ స్కాం కేసులో కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. కానీ సీఎం పదవికి అప్పుడు రాజీనామా చేయలేదు. ప్రచారం నిమిత్తం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది. ఆయన విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఢిల్లీలో ఒక్కచోట కూడా ఆప్‌ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. పంజాబ్‌లో ఆప్‌ మూడు స్థానాలకే పరిమితమైంది. హరియాణాలో కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. కేజ్రీవాల్‌పై ఓటర్లు సానుభూతి చూపలేదని, ఆప్‌పై వారు పెట్టుకున్న భ్రమలు తొలగిపోయాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే, సీఎం కార్యాలయానికి వెళ్లరాదని.. ఫైళ్లపై సంతకాలు చేయరాదన్న షరతులతో మద్యం కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామాచేసి.. ఆతిశీని సీఎం స్థానంలో కూర్చోబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మళ్లీ గెలిచాకే ఆ పదవి చేపడతానని శపథం చేశారు. కాంగ్రె్‌సతో కూడా తెగతెంపులు చేసుకున్నారు. తనను దొంగగా చిత్రించేందుకే బీజేపీ తనను అరెస్టు చేయించిందని విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా.. జైలుకు వెళ్లడం అభ్యర్థుల విజయావకాశాలను ఏ మాత్రం ప్రభావితం చేయదని ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌ అభిషేక్‌ వ్యాఖ్యానించారు. దేశంలో చాలా మంది నేతలపై క్రిమినల్‌ కేసులున్నాయని.. అవి వారి రాజకీయ జీవితాలను దెబ్బతీయలేదన్నారు. ఏడీఆర్‌ విశ్లేషణ ప్రకారం.. ఢిల్లీలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 19ు మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి.

ఢిల్లీ ముస్లిం ఓటర్ల డైలమా!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో అక్కడి ముస్లిం ఓటర్లు తేల్చుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ ఓటర్ల సంఖ్య 1.55 కోట్లు. ఇందులో 13ు మంది ముస్లిం ఓటర్లు ఉన్నట్లు అంచనా. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కనీసం ఏడు చోట్ల పెద్ద సంఖ్యలోనే ముస్లిం ఓటర్లు ఉన్నారు. పలు స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో వారు ఉన్నారని తెలుస్తోంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో మూడు రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. మొదటిది.. బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలి. ఇందుకోసం ఆప్‌ పార్టీకే ఓటేయాలి. రెండోది.. 2020లో ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు ఆప్‌ తమను గాలికొదిలేసిందని పలువురు ముస్లింలు ఆగ్రహంతో ఉన్నారు. అందుచేత ఈసారి కాంగ్రె్‌సకు మద్దతివ్వాలని భావిస్తున్నారు. మూడోది.. ఆప్‌, కాంగ్రె్‌సలతో వెళ్లడం వల్ల లాభం లేదని.. ఈ సారి ఎంఐఎంతో వెళ్దామని.. ఆ పార్టీ కనీసం ముస్లింల సమస్యలను లేవనెత్తుతోందని ఈ ఆలోచన ఉన్నవారు అంటున్నారు. 2020 అల్లర్ల సూత్రధారులుగా భావిస్తున్న తాహిర్‌ హుస్సేన్‌, షియా-ఉర్‌-రహమాన్‌ ఎంఐఎం అభ్యర్థులుగా పోటీచేస్తుండడంతో మూడో ఆలోచనపై కొందరిలో మొగ్గు కనిపిస్తోంది.

Updated Date - Feb 04 , 2025 | 05:17 AM