Share News

ISRO: కక్ష్యలో అలసంద మొలకలు

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:40 AM

పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు మొలకెత్తాయని, =

ISRO: కక్ష్యలో అలసంద మొలకలు

వాటికి రెండేసి ఆకులు.. ఇస్రో ‘క్రాప్స్‌’ ప్రయోగం సక్సెస్‌

బెంగళూరు, జనవరి 6: పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ప్రయోగంలో భాగంగా ఇస్రో రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు మొలకెత్తాయని, వాటికి రెండేసి ఆకులు కూడా వచ్చాయని ఇస్రో సోమవారం ప్రకటించింది. రాకెట్‌ నాలుగో దశలోని పీఎ్‌సఎల్వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (పోయెమ్‌-4) ద్వారా 24 పేలోడ్లను ఇస్రో రోదసీలోకి పంపింది. వాటిలో కంపాక్ట్‌ రిసెర్చ్‌ మాడ్యూల్‌ ఫర్‌ ఆర్బిటల్‌ ప్లాంట్‌ స్టడీ (క్రాప్స్‌) అనే పరికరం కూడా ఉంది. దీన్ని తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ) అభివృద్ధి చేసింది. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన ప్లాట్‌ఫాం ఇది. దీనిలో ఎనిమిది అలసంద గింజలు పెట్టి స్పేస్‌లోకి పంపించగా.. అవి నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయని, ఇప్పుడవి రెండు ఆకుల దశకు వచ్చాయని ఇస్రో తెలిపింది. ‘ఈ విజయం అంతరిక్షంలో మొక్కలు పెంచగల ఇస్రో సామర్థ్యాన్ని తెలియజేయడమే కాకుండా.. భవిష్యత్తులో దీర్ఘకాలిక మిషన్లకు అవసరమైన విలువైన సమాచారాన్ని అందిస్తుంది’ అని ఇస్రో ఎక్స్‌లో పేర్కొంది. వ్యోమగాములకు ఆహారాన్ని ఉత్పత్తి చేయగల, గాలి, నీటిని పునరుత్పత్తి చేయగల లైఫ్‌ సపోర్ట్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, మొక్కలు సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా ఎలా మారతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రయోగం చాలా ముఖ్యమని ఇస్రో వెల్లడించింది. ‘క్రాప్స్‌’ విజయం అంతరిక్షంలో సుస్థిర మానవ ఉనికి దిశగా ఆశాజనకమైన ముందడుగు అని పేర్కొంది.

స్పేడెక్స్‌ డాకింగ్‌ రెండు రోజులు వాయిదా

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) మిషన్‌లో కీలకమైన డాకింగ్‌ ప్రక్రియ రెండు రోజులపాటు వాయిదా పడింది. గత నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్‌ ద్వారా జంట ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లోని ఛేజర్‌ (ఎస్‌డీఎక్స్‌01), టార్గెట్‌ (ఎస్‌డీఎక్స్‌02) ఉపగ్రహాలను ఈ నెల 7న (మంగళవారం) అనుసంధానించాలని ఇస్రో భావించింది. అయితే.. మరింత కచ్చితత్వం కోసం క్షేత్రస్థాయిలో కొన్ని సిమ్యులేషన్లు పూర్తిచేసేందుకు డాకింగ్‌ ప్రక్రియను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు ఇస్రో సోమవారం తెలిపింది.

Updated Date - Jan 07 , 2025 | 04:40 AM