ISRO successfully launched: సాహోరె బాహుబలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:29 AM
భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం సీఎంఎ్‌స-3ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.
భారత గడ్డపై నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి
ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతం
16.29 నిమిషాల్లోనే కక్ష్యలోకి సీఎంఎస్-03 శాటిలైట్
భారీ ఉపగ్రహ ప్రయోగంతో కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో
ఎల్వీఎం3 ప్రయోగాల్లో వరుసగా ఎనిమిదో విజయం చరిత్రలో మైలురాయి: ఇస్రో
చైర్మన్ నారాయణన్
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న ఎల్వీఎం3-ఎం5 రాకెట్
సూళ్లూరుపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం సీఎంఎ్‌స-3ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. భారత నౌకాదళం కోసం ఇస్రో చేపట్టిన భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. 4,410 కిలోల బరువైన మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎ్‌స-3తో నింగిలోకి ఎగిరిన ఎల్‌వీఎం3-ఎం5 ‘బాహుబలి’ రాకెట్ దాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఈ క్రమంలో ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో వరుసగా 8వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్.. తన మూడు
దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని 4,410 కిలోల బరువైన సీఎంఎస్-3 ఉపగ్రహాన్ని 16.29 నిమిషాల్లోనే నిర్ణీత కక్ష్యలో విడిచిపెట్టింది. ఆ వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకొని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఎల్వీఎం3-ఎం5 రాకెట్ విజయవంతమైందని ప్రకటించారు.
వచ్చే ఐదు నెలల్లో ఏడు ప్రయోగాలు
ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ప్రయోగం దేశానికే గర్వకారణమని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ అన్నారు. ఈ విజయం ఇస్రో చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. సీఎంఎస్-03 విజయానంతరం ఆయన మీడియా సెంటర్‌లో మాట్లాడుతూ.. ‘కక్ష్యలోకి విజయవంతంగా చేరిన ఉపగ్రహం స్థిరంగా ఉన్నట్లు బెంగుళూరులోని హసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్ అందాయి. ఇది ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ ఉపగ్రహం. దీని బరువు 4,410 కిలోలు. ఈ ప్రయోగంతో భారత్ మరో ఘనత సాధించింది’ అని తెలిపారు. వచ్చే ఐదు నెలల్లో ఏడు ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచించామని తెలిపారు. డిసెంబరు తొలివారంలో ఎల్వీఎం3-ఎ06 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని, డిసెంబరు చివరిలో పీఎ్‌సఎల్వీ-సీ62 ద్వారా ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది జీఎ్‌సఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం ఉంటుందన్నారు. పీఎ్‌సఎల్వీ-ఎల్1, ఎస్‌ఎ్‌సఎల్వీ, గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగ పనులు కూడా జరుగుతున్నాయన్నారు.
భారత్ నుంచి ఇదే తొలిసారి
ఇస్రో గతంలో కూడా ఇంతటి భారీ ఉపగ్రహాలను ప్రయోగించింది. కానీ.. అవన్నీ ఫ్రెంచ్ గయానా నుంచి ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ అందించిన రాకెట్ల ద్వారా ప్రయోగించినవే. 2018 డిసెంబరు 18న ఫ్రెంచ్ గయానా నుంచి 5,854 కిలోల బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-11ను ఇస్రో ప్రయోగించింది. భారత భూభాగం నుంచి జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీవో)లో ప్రవేశపెట్టిన తొలి భారీ ఉపగ్రహం సీఎంఎస్-03 కావడం విశేషం.
ప్రధాని, ఉపరాష్ట్రపతి అభినందనలు
భారత గడ్డపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అభినందించారు. ‘మన శాస్త్రవేత్తల కృషితో అంతరిక్ష రంగం అద్భుతమైన ఆవిష్కరణలకు పర్యాయపదంగా మారడం ప్రశంసనీయం. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు జాతీయ పురోగతిని పెంచాయి’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఇస్రో, భారత నావికా దళానికి అభినందనలు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్‌లో మరో గర్వించదగిన మైలురాయికి చిహ్నం’ అని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు.
సీ25 క్రయోజనిక్ దశపై కొత్త ప్రయోగం
ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్‌కు సంబంధించిన సీ25 క్రయోజనిక్ దశపై కొత్త ప్రయోగం నిర్వహించామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ‘‘దేశీయంగా అభివృద్ధి చేసిన సీ25 క్రయోజనిక్ దశను.. రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన తర్వాత మరోసారి మండించాం. అది విజయవంతమైంది. ఇదొక గొప్ప ప్రయోగం. భవిష్యత్తులో క్రయోజనిక్ దశను పునఃప్రారంభించడానికి అవసరమైన డేటాను అందిస్తుంది. ఎల్‌వీఎం3 రాకెట్‌ను ఉపయోగించి బహుళ ఉపగ్రహాలను వివిధ కక్ష్యల్లోకి ప్రవేశపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది’ అని నారాయణన్ తెలిపారు.
జీశాట్-7 సిరీస్.. నిఘాకు, రక్షణకు..
భారత్ రక్షణపరంగా, నిఘా కోసం, సరిహద్దుల వెంట, సముద్రంలో పరిస్థితుల సమాచారం, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా జీశాట్-7 సిరీస్ ఉపగ్రహాలు ప్రయోగిస్తోంది. అందులో మొదటిది జీశాట్-7. 2,625 కిలోల ఆ ఉపగ్రహాన్ని 2013లో ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్షంలోకి పంపారు. నౌకాదళం కోసం ప్రత్యేకించిన ఉపగ్రహం. దాని కాలపరిమితి ముగింపునకు రావడంతో.. ఆ స్థానంలో ఆధునికమైన, సమర్థవంతమైన సీఎంఎస్03 (జీశాట్-7ఆర్) ఉపగ్రహాన్ని ఇప్పుడు ప్రయోగించారు. ఇక వైమానిక దళం, సైన్యం కోసం ప్రత్యేకించిన జీశాట్-7ఏను 2018లో ప్రయోగించారు. దాని స్థానంలో ఆర్మీ కోసం మరింత మెరుగైన ఉపగ్రహం జీశాట్-7బీని అభివృద్ధి చేస్తున్నారు.
ఎల్‌వీఎం-3.. గగనయానం
సీఎంఎస్03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఎల్‌వీఎం-3(లాంచ్ వెహికల్ మార్క్-3) రాకెట్‌ను భారత ‘బాహుబలి’గా పిలుస్తారు. జీఎ్‌సఎల్వీ మార్క్-3 రాకెట్‌కు పలు మార్పులు చేసి దీనిని అభివృద్ధి చేశారు. దీని బరువు 640 టన్నులు, ఎత్తు 43.5 మీటర్లు. మూడు దశల ఇంధనంతో అంతరిక్షంలోకి దూసుకెళుతుంది. చివరి దశలో భారత్ అభివృద్ధి చేసిన ‘సీఈ-20’ క్రయోజనిక్ ఇంజన్‌ను అమర్చారు. భూసమీప కక్ష్య (ఎల్‌ఈవో)లోకి పది వేల కిలోల పేలోడ్‌ను, జీటీవో కక్ష్యలోకి 4,500 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. సమీప భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న చంద్రయాన్, గగన్‌యాన్ ప్రయోగాలన్నీ ఎల్‌వీఎం-3తోనే జరగనున్నాయి. ఇక ఎల్‌వీఎంను మరింత అభివృద్ధి చేసి ‘నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జీఎల్‌వీ)’ని రూపొందించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఎనిమిది టన్నుల బరువైన పేలోడ్లను జీటీవో (జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్) కక్ష్యలోకి చేర్చేలా దానిని అభివృద్ధి చేయనున్నారు.
సీఎంఎస్03.. సురక్షిత తీరం
భారత సముద్ర తీరం నుంచి సుమారు 3,500 కిలోమీటర్ల దూరం వరకు మన నౌకా దళానికి అవసరమైన సేవలను సీఎంఎస్03 ఉపగ్రహం అందిస్తుంది. దీనిలో యూహెచ్‌ఎ్‌ఫ, ఎస్, సీ, కేయూ బ్యాండ్ రాడార్లను అమర్చారు. దీని సాయంతో తీర ప్రాంతమంతటా నిఘా పెట్టడంతోపాటు ఒకే సమయంలో అత్యంత వేగంగా వివిధ రకాల కమ్యూనికేషన్లకు వీలు కల్పిస్తుంది. సముద్రంలో ఉన్న యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, సముద్రంపై ఎగురుతున్న యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల నుంచి.. నౌకాదళ ప్రధాన కార్యాలయానికి ఎప్పటికప్పుడు డేటాను అందిస్తుంది. అది కూడా మధ్యలో గుర్తించలేని విధంగా, హ్యాక్ చేయలేని విధంగా డేటాను, కాల్స్‌ను ఎన్‌క్రి్‌ప్ట చేసి, సురక్షితమైన కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఈ ఉపగ్రహం నుంచి నౌకాదళానికి చేరే సమాచారాన్ని, కాల్స్‌ను, సిగ్నల్స్‌ను మధ్యలో ఎవరూ జామ్ చేయకుండా ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించారు.