Share News

Bahubali rocket: బాహుబలి గ్రాండ్‌ సక్సెస్‌!

ABN , Publish Date - Dec 25 , 2025 | 03:55 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చారిత్రక మైలురాయిని తాకింది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత భారీ బరువైన .....

Bahubali rocket: బాహుబలి గ్రాండ్‌ సక్సెస్‌!

  • నిప్పులు చిమ్ముతూ ఎల్‌వీఎం3-ఎం6 నింగికి

  • భారత అంతరిక్ష రంగ చరిత్రలో 6,000 కేజీల బరువైన అతి భారీ శాటిలైట్‌ ప్రయోగం ఇదే

సూళ్లూరుపేట, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చారిత్రక మైలురాయిని తాకింది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత భారీ బరువైన ఎల్‌వీఎం3-ఎం6(బాహుబలి)ను విజయవంతంగా ప్రయోగించి రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ కోసం దాదాపు 6,000 కిలోల ‘బ్లూబ ర్డ్‌ బ్లాక్‌-2’ ఉపగ్రహాన్ని తిరుపతి జిల్లా శ్రీహరికోట లో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ‘లో ఎర్త్‌ ఆర్బిట్‌’(ఎల్‌ఈవో)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఇస్రో ఎల్వీఎం 3 రాకెట్‌ ప్రయోగాల్లో తొమ్మిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాగా, భారత భూభాగం నుంచి ప్రయోగించిన అతిపెద్ద వాణిజ్య ర్యాకెట్‌ ఇదేనని, ఇది ఈ ‘సీజన్‌ గిఫ్ట్‌’ అని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ అభివర్ణించారు. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచంలో ఎక్కడున్నా.. అంతరిక్షం నుంచే 4జీ, 5జీ వాయిస్‌, వీడియో కాల్స్‌, సందేశాలు, స్ట్రీమింగ్‌, డేటా వంటివాటిని ఎవరైనా.. ఏ సమయంలో అయినా పొందేందుకు అవకాశం ఉంటుంది. అమెరికాకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్‌ మొబైల్‌, ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎ్‌సఐఎల్‌)ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఎల్‌వీఎం3-ఎం6 ర్యాకెట్‌.. బుధవారం ఉదయం 8.55 గం టల సమయంలో నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయిది.

‘బ్లూబర్డ్‌’ పేరే ఎందుకు?

ఏఎ్‌సటీ స్పేస్‌మొబైల్‌ సంస్థకు చెందిన ఉపగ్రహానికి బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 పేరును నిర్ధారించడం వెనుక ఆసక్తికర విషయం ఉంది. గగనంలో విహరించే పక్షులకు హద్దులు లేనట్టే.. ఈ ఉపగ్రహం ద్వారా వచ్చే పుంజాలకు కూడా ఎలాంటి గౌండ్‌ టెర్మినళ్లు, ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు. అంతేకాదు.. పక్షులకు ఎలాంటి స్వేచ్ఛ ఉంటుందో.. అదేవిధంగా ఈ ఉపగ్రహం ప్రపంచ కమ్యూనికేషన్‌ కనెక్టివిటీకి స్వేచ్ఛగా సిగ్నళ్లను పంపిస్తుంది. అందుకే.. ‘బ్లూబర్డ్‌’ పేరు పెట్టారు.

90 సెకన్ల ఆలస్యం వెనుక..

వాహక నౌక ఎల్‌వీఎం3-ఎం6ను బుధవారం ఉదయం 8.54 గంటలకే ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. అయితే.. సాంకేతికపరమైన కారణాలతో ఈ ప్రయోగం 90 సెకన్లపాటు ఆలస్యమైంది. అనంతరం.. 8.55.30 గంటలకు ప్రయోగాన్ని చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ జాప్యం జరిగినట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. వాహక నౌక ప్రయాణ మార్గంలో శిథిలాలు, ఇతర ఉపగ్రహాల సంయోగాలు ఉండడంతో ఢీకొనే అవకాశం ఉందని అంచనా వేశామని, అందుకే 90 సెకన్ల ఆలస్యంగా ప్రయోగం చేపట్టినట్టు పేర్కొన్నాయి. ఈ జాప్యం అసాధారణం కాదని, శ్రీహరికోట గగనతలంలో వేలకొద్దీ ఉపగ్రహాలు నిరంతరం ప్రయాణిస్తుంటాయని వివరించాయి.


52 రోజుల్లో రెండోది!

‘ఎల్‌ఎంవీ’ ఉపగ్రహాల ప్రయోగంలో ఇస్రో వంద శాతం విజయవంతమైంది. నవంబరులో చేపట్టిన తొలి ఎల్‌వీఎం3-ఎం5 ఉపగ్రహం బరువు 4,400 కిలోలు. దీనిని విజయవంతంగా జియోసింక్రనైజ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌(జీటీవో)లోకి ప్రవేశపెట్టారు. తాజా ఎల్‌ఎంవీ3-ఎం6 ఉపగ్రహం బరువు 6000 కిలోలు కావడం, కక్ష్యలోకి విజయవంతంగా చేరుకోవడం విశేషం. దీంతో కేవలం 52 రోజుల్లోనే ఇస్రో రెండు ఎల్‌ఎంవీలు చేపట్టిన ఘనతను సొంతం చేసుకుంది.

అంతరిక్షం నుంచి నేరుగా..

బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహంతో ప్రపంచంలోని ఏమూలకైనా బ్రాడ్‌ బ్యాండ్‌ సిగ్నళ్లు అందుతాయి. అంతేకాదు.. భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. మారుమూల ప్రాంతాల నుంచి విశ్వసనీయ కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కూడా ఈ ఉపగ్రహం సేవలందించనుంది. అంతేకాదు.. ఈ సేవల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ అంతరం తగ్గిపోనుంది. అదేవిధంగా అధునాతన ఉపగ్రహ సాంకేతికతతో ప్రపంచ సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

అమెరికాలోని టెక్సా్‌సకు చెందిన ఏఎ్‌సటీ స్పేస్‌ మొబైల్‌ సంస్థ బెంగళూరు కేంద్రంగా భారత్‌లో పనిచేస్తోంది. బ్రాడ్‌ బ్యాండ్‌ పుంజాలను మధ్యలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు లేకుండా.. అంతరిక్షం నుంచి నేరుగా స్మార్ట్‌ ఫోన్లలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 ఉపగ్రహ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనిద్వారా హైస్పీడ్‌ సెల్యూలర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ నేరుగా స్మార్ట్‌ఫోన్లకు అందుతుంది. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా సిగ్నళ్లు చేరుకుంటాయి. స్టార్‌లింక్‌, వన్‌వెబ్‌ వంటి ఉపగ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన గ్రౌండ్‌ స్టేషన్‌ను, టెర్మిళ్లను ఏర్పాటు చేయాలి. కానీ, బ్లూబర్డ్‌ సిస్టమ్‌లో ఇలాంటి ఏర్పాటు అవసరం ఉండదు. పైగా అతిపెద్ద వాణిజ్య సమాచార ఉగ్రహం కావడం విశేషం.


ఉపగ్రహ విశేషాలు ఇవీ..

ఉపగ్రహ వాహక నౌకలో రెండు ఎస్‌200 సాటిడ్‌ బూస్టర్లను వినియోగించారు. వీటిద్వారా భారీ మొత్తంలో థ్రస్ట్‌ అందుతుంది. ఈ బూస్టర్‌ను విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ అభివృద్ధి చేసింది. ఏఎ్‌సటీ స్పేస్‌ మొబైల్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక చైర్మన్‌, ఎండీ పి. మోహన్‌ ప్రకటన మేరకు.. గత ఏడాది సెప్టెంబరులో బ్లూబర్డ్‌ ఉపగ్రహాలను ఐదు ప్రయోగించారు. వీటి ద్వారా అమెరికా సహా ఎంపిక చేసిన దేశాలకు సేవలు అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 మొబైల్‌ ఆపరేటర్లకు సేవలు అందించేందుకు ఇదే తరహా ఉపగ్రహాలను మరిన్ని ప్రయోగించనున్నారు.

మోదీకి ధన్యవాదాలు: ఏఎ్‌సటీ

బ్లూబర్డ్‌6 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల అమెరికాకు చెందిన ఏఎ్‌సటీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఎబెల్‌ ఎవెల్లన్‌ హర్షం వ్యక్తం చేశారు. భారీ వాణిజ్య పరమైన అంతరిక్ష ప్రయోగానికి సహకరించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాము వాషింగ్టన్‌ డీసీలోని కమాండ్‌ కేంద్రం నుంచి సాధారణ టెలీమెట్రీతో బ్లూబర్డ్‌6 నియంత్రణలో ఉన్నట్టు పేర్కొన్నారు.

పలు విశేషాలు..

  • హై స్పీడ్‌ సెల్యూలర్‌ బ్రాడ్‌ బ్యాండ్‌.

  • స్మార్ట్‌ఫోన్‌కు నేరుగా సిగ్నళ్లు.

  • వ్యాపార, ప్రభుత్వ అవసరాలకు వినియోగం.

  • ర్యాకెట్‌ పొడవు: 43.5 మీటర్లు

  • ఉపగ్రహం బరువు: 6,000 కిలోలు

  • 15 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యం చేరిక

  • భారత భూభాగంలో చేసిన భారీ ప్రయోగం.

  • ప్రపంచ అత్యుత్తమ ప్రయోగాల్లో ఇదొకటి.

  • మూడు దశల్లో దీనిని చేపట్టారు.

  • ఎస్‌200 బూస్టర్ల నాజిల్స్‌ను నియంత్రించేందుకు ఇస్రో తొలిసారి ఎలకో్ట్ర-మెకానికల్‌ ఆక్టేటర్స్‌ను వినియోగించింది.

  • ఇప్పటి వరకు హైడ్రాలిక్‌ వ్యవస్థను వినియోగించారు.

  • కొత్త విధానంతో ఉపగ్రహాలను తేలికగా అంతరిక్షంలోకి చేర్చచ్చు.

  • ఎల్‌వీఎం3 ముద్దుపేరు.. ‘బాహుబలి’

  • ఎల్‌వీఎం3.. 100 శాతం సక్సెస్‌ రేటుసాధించింది.

ప్రపంచ మార్కెట్‌లోకి భారత్‌!

తాజా ప్రయోగంతో భారీ వాణిజ్య ఉపగ్రహాల ప్రపంచ మార్కెట్‌లోకి భారత్‌ ప్రవేశించినట్టయింది. అంతేకాదు, స్పేస్‌ఎక్స్‌, ఏరియానేస్పేస్‌, రోస్కోస్మోస్‌ వంటి దిగ్గజ సంస్థల బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి కూడా భారత్‌ గట్టి పోటీ ఇవ్వనుంది.

Updated Date - Dec 25 , 2025 | 06:04 AM