Share News

ISRO: స్పేడెక్స్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

ABN , Publish Date - Mar 14 , 2025 | 05:06 AM

స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) మిషన్‌లో భాగంగా రెండు నెలల క్రితం ఎస్‌డీఎస్స్‌-01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌-02 (టార్గెట్‌) ఉపగ్రహాలను కక్ష్యలో అనుసంధానం (డాకింగ్‌) చేసిన ఇస్రో.. తాజాగా వాటిని వేరు చేసినట్టు (అన్‌డాకింగ్‌) తెలిపింది.

ISRO: స్పేడెక్స్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

  • కక్ష్యలో చేజర్‌, టార్గెట్‌లను వేరు చేసిన ఇస్రో

  • చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌లకు లైన్‌ క్లియర్‌

బెంగళూరు, మార్చి 13: స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) మిషన్‌లో భాగంగా రెండు నెలల క్రితం ఎస్‌డీఎస్స్‌-01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌-02 (టార్గెట్‌) ఉపగ్రహాలను కక్ష్యలో అనుసంధానం (డాకింగ్‌) చేసిన ఇస్రో.. తాజాగా వాటిని వేరు చేసినట్టు (అన్‌డాకింగ్‌) తెలిపింది. ఈ ప్రక్రి య విజయవంతమైందని ప్రకటించింది. ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్‌లో భాగంగా గత ఏడాది డిసెంబరు 30న ఇస్రో ఛేజర్‌, టార్గెట్‌ అనే జంట ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపింది. పలు ప్రయత్నాల అనంతరం జనవరి 16న వాటిని విజయవంతంగా డాకింగ్‌ చేసింది. దీంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆ జంట ఉపగ్రహాలను విజయవంతంగా అన్‌డాకింగ్‌ చేసింది. ఈ ప్రయత్నాలు సక్సెస్‌ కావడంతో మరింత కచ్చితత్వం కోసం ఇస్రో భవిష్యత్తులో మరిన్ని డాకింగ్‌, అన్‌డాకింగ్‌ విన్యాసాలు చేపట్టే అవకాశం ఉంది.


అద్భుత వీడియోలు పంచుకున్న ఇస్రో

సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, చంద్రయాన్‌-4, గగన్‌యాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక భవిష్యత్‌ మిషన్లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తూ ఇస్రో స్పేడెక్స్‌ ఉపగ్రహాలను విజయవంతంగా వేరు చేసింది. కక్ష్యలో విడిపోతున్న ఉపగ్రహాలకు సంబంధించిన అద్భు త దృశ్యాలకు సంబంధించి ఇస్రో ఎక్స్‌లో రెండు వీడియోలు పోస్టు చేసింది. అందులో ఛేజర్‌ నుంచి టార్గెట్‌ విడిపోతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. కాగా, స్పేడెక్స్‌ మిషన్‌ అన్‌డాకింగ్‌ సక్సెస్‌ కావడంతో ఇస్రో బృందానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జితేంద్ర సింగ్‌ అభినందనలు తెలిపారు. కాగా, ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి స్పేడెక్స్‌ మిషన్‌లో మరిన్ని ప్రయోగాలు చేపడతామని చెప్పారు.

Updated Date - Mar 14 , 2025 | 05:06 AM