పది ఉపగ్రహాలతో నిత్యం పహారా: ఇస్రో
ABN , Publish Date - May 13 , 2025 | 05:55 AM
భారత భద్రత కోసం ఇస్రో కనీసం పది ఉపగ్రహాలతో నిరంతరం పహరా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ నారాయణన్ తెలిపారు. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర తీరాలు, సరిహద్దులను నిఘా చేస్తున్నారు.
ఇంఫాల్, మే 12: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దేశ ప్రజల భద్రత, రక్షణ నిమిత్తం కనీసం పది ఉపగ్రహాలు ఆకాశంలో నిరంతరం పహరా కాస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సీఏయూ) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల మధ్య దేశ భద్రత కోసం ఇస్రో చేస్తున్న కృషిని వివరించారు. ‘మన ఇరుగు పొరుగు దేశాల గురించి అందరికీ తెలుసు. మన దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ఉపగ్రహాలతో నిత్యం నిఘా పెట్టాలి. 7 వేల కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర ప్రాంతాలను పర్యవేక్షించాలి. మన ఉత్తర భాగాన్నంతా నిరంతరం పరిశీలించాలి. ఉపగ్రహాలు, డ్రోన్ల సాయం లేకుండా దాన్ని సాధించలేం’ అని నారాయణన్ అన్నారు.