Share News

Israel-Iran Conflict: మన విమానాలకు మరింత భారం!

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:33 AM

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం, అమెరికా కూడా రంగంలోకి దిగి దాడులు చేయడంతో పర్షియన్‌ గల్ఫ్‌లో గగనతలం ప్రమాదకరంగా మారింది.

Israel-Iran Conflict: మన విమానాలకు మరింత భారం!

  • ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో యూరప్‌ దేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు

న్యూఢిల్లీ, జూన్‌ 22: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం, అమెరికా కూడా రంగంలోకి దిగి దాడులు చేయడంతో పర్షియన్‌ గల్ఫ్‌లో గగనతలం ప్రమాదకరంగా మారింది. దీనితో భారత్‌ నుంచి యూరప్‌ దేశాలకు ప్రయాణించే విమానాలు మరింత చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పాకిస్థాన్‌ గగనతలాన్ని భారత విమానయాన సంస్థలు వినియోగించడం లేదు. ఇప్పుడు పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతాన్నీ వినియోగించలేకపోవడంతో.. యూర్‌పకు వెళ్లే విమానాలు ఒమన్‌, సౌదీ అరేబియా, ఈజిప్ట్‌ మీదుగా... లేదా హిందూకుష్‌ పర్వత శ్రేణులు, చైనా, తజకిస్తాన్‌ మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాలి.


యూరప్‌ దేశాల నుంచి భారత్‌ సహా పలు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వచ్చే విమానాలన్నీ కూడా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిందే. దీనితో సుమారు రెండు, మూడు గంటల పాటు అదనంగా ప్రయాణించాల్సి ఉంటుందని అంచనా. దీనికి అదనంగా ఖర్చయ్యే ఇంధనం, అవసరమైతే మధ్యలో ఆగి ఇంధనం నింపుకోవడం, ఈ జాప్యంతో విమానాల నిర్వహణ షెడ్యూల్‌ మారడం వంటివి విమానయాన సంస్థలకు తీవ్ర భారం కానున్నాయి. ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ), జ్యూరిచ్‌(స్విట్జర్లాండ్‌)లకు వెళ్లే విమానాలు, వాటి తిరుగు సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది.

Updated Date - Jun 23 , 2025 | 04:33 AM