Israel Approves Gaza: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదం
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:19 AM
గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పూర్తి స్థాయి
పూర్తి స్థాయి క్యాబినెట్ ఆమోదమే తరువాయి
టెల్ అవీవ్, ఆగస్టు 8: గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పూర్తి స్థాయి క్యాబినెట్ ఆమోదం పొందితే ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సరిహద్దుకు భారీగా సైనికులను తరలించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోందనే కథనాలు వస్తున్నాయి. హమా్‌సను నాశనం చేయడం, బందీలను విడిపించుకోవడం, గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం, గాజాకు ఇజ్రాయెల్ భద్రత కల్పించడం, గాజాను తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమనే 5 అంశాలతో తాజా ప్రణాళిక రూపొందించారు. అయితే గాజాను స్వాధీనం చేసుకోవడం తమ లక్ష్యం కాదని, హమాస్ ఉగ్రవాదుల వద్ద ఉన్న తమ బందీలను విడిపించుకుని, ఆ ప్రాంతాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించడమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. కాగా, గాజాను స్వాధీనం చేసుకోవాలనుకునే ప్రణాళిక తప్పని బ్రిటన్ ప్రధాని కీర్‌స్టార్మర్ తెలిపారు. ఈ చర్య మరింత రక్తపాతానికి దారితీస్తుందని చెప్పారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంటే ప్రణాళికను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు ఇంతకాలం ఇజ్రాయెల్‌ను గట్టిగా సమర్థించిన జర్మనీ తాజాగా తన వైఖరిని మార్చుకుంది. ఇజ్రాయెల్‌కు సైనిక ఉత్పత్తులను ఎగుమతి చేయరాదని నిర్ణయించుకున్నట్లు జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చెప్పారు.