Share News

191 దేశాల్లో నేడు యోగా దినోత్సవం

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:32 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల్లోని 1300 నగరాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

191 దేశాల్లో నేడు యోగా దినోత్సవం

న్యూఢిల్లీ, జూన్‌ 20 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 191 దేశాల్లోని 1300 నగరాల్లో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా భారత హైకమిషన్‌ యోగాపై ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారత సాంస్కృతిక సంబంధాల మండలి(ఐసీసీఆర్‌) శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖలో ఈ మండలి ఒక భాగం. అంతర్జాతీయ యోగా దినోత్సవ పదో వార్షికోత్సవం సందర్భంగా దాదాపు ప్రపంచంలోని ప్రతి దేశంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐసీసీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ కె. నందిని సింగ్లా ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో పలు నగరాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 1300 ప్రాంతాల్లో 2000కు పైగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


బ్రెజిల్‌, అర్జెంటీనా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్‌, దక్షిణ కొరియా వంటి 15 దేశాల నుంచి వచ్చిన 17 మంది యోగా గురువుల ఆధ్వర్యంలో మన దేశంలో ‘యోగా బంధన్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌, కుతుబ్‌ మినార్‌, పురానా ఖిల్లా, హుమాయూన్‌ టూంబ్‌ వంటి చోట్ల వీరి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. లఖ్‌నవూ, అయోధ్య, వారాణసీ, జైపుర్‌, జోధ్‌పూర్‌, భోపాల్‌, గ్వాలియర్‌ వంటి నగరాల్లోని ప్రసిద్ధ ప్రాంతాల్లో ‘యోగా బంధన్‌’ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన యోగాను నేర్చుకున్న విదేశీయులు నేడు మన దేశంలో యోగా కార్యక్రమాలకు నాయకత్వం వహించేందుకు రావడం విశేషమని ఐసీసీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవ థీమ్‌గా ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌, వన్‌ హెల్త్‌’ని నిర్ణయించారు.

Updated Date - Jun 21 , 2025 | 06:32 AM