Share News

Internals Introduced for First Year: ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

ABN , Publish Date - Oct 26 , 2025 | 04:31 AM

ఇప్పటివరకు ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్‌ వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ.....

Internals Introduced for First Year: ఇంటర్‌ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్‌

  • అన్ని గ్రూపులకు 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు.. కొత్తగా ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌) గ్రూప్‌

  • ఎంపీసీ, బైపీసీ పాఠ్యాంశాల్లో మార్పు

  • వచ్చే ఏడాది నుంచి అమలు

  • ఫిబ్రవరి 25 నుంచి మార్చి

  • 18 వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు

  • 494 అతిథి అధ్యాపకుల

  • నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

  • వారంలో నియామకాలు ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్‌ వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ నిర్వహించనున్నామని ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. విద్యార్థులకు ప్రయోగాత్మక (ప్రాక్టికల్‌) విద్య పరిజ్ఞానం ఎక్కువగా ఉండాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న అంశాలపై ఆయన శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఇక నుంచి ఇంటర్‌ అన్ని గ్రూపుల్లో ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, 20 శాతం మార్కులకు ఇంటర్నల్స్‌, 80 శాతం మార్కులకు వార్షిక పరీక్షలు ఉంటాయన్నారు. మొదటిసారి అరబిక్‌, ఉర్దూ, సంస్కృతం భాషల్లో కూడా ప్రయోగాత్మక పాఠాలు (ల్యాబ్‌ ప్రాక్టికల్స్‌) ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇవి ఇంగ్లిష్‌ భాషా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంపీసీ, బైపీసీ అన్ని సబ్జెక్టుల్లో కొత్త పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయని, దీనికోసం సబ్జెక్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇంతకుముందు చివరిసారిగా 11 ఏళ్ల క్రితం పాఠ్యాంశాల మార్పు జరిగిందని కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. కొత్తగా ముద్రించే పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని, దీంతో విద్యార్థులు ఆన్‌లైన్లోనూ చదువుకునే వీలుంటుందన్నారు. అలాగే భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌) గ్రూప్‌ను ప్రారంభిస్తున్నామని, ఇది ప్రభుత్వ కాలేజీల్లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహిస్తామని, పరీక్ష ఫీజు నోటిఫికేషన్‌ నవంబరు1న విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు స్థానిక ప్రైవేటు కాలేజీల్లోని ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేసుకునేందుకు ఉద్దేశించిన టీ-స్టెమ్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని, దీనికోసం అత్యాధునిక వసతులున్న 1,400 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను గుర్తించామన్నారు. 494 అతిథి అధ్యాపకులను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందని, వారం రోజుల్లో నియామకం చేస్తామన్నారు. గురుకులాల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసే అధికారం జిల్లాస్థాయిలో కలెక్టర్లకే ఇచ్చామని గురుకులాల సంస్థకు కార్యదర్శిగా కూడా ఉన్న కృష్ణ ఆదిత్య తెలిపారు.


కార్పొరేట్ల కోసమే

ఇంటర్నల్స్‌: ఇంటర్‌ విద్య జేఏసీ

విద్యావేత్తలు, తల్లిదండ్రులు, నిపుణులతో కనీసం చర్చించకుండా ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని ప్రకటించడం పట్ల ఇంటర్‌ విద్య జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రెండేళ్ల క్రితం చర్చించిన అధికారులు.. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తమ నిర్ణయాన్ని విరమించుకున్నారని, ఇప్పుడు ఎలాంటి చర్చలేకుండా ఇంటర్‌ విద్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సైతం ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇంటర్నల్‌ మార్కులతో ఇంటర్‌ విద్య పతనమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి ఇంటర్నల్‌ మార్కులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అలాంటప్పుడు ఇంటర్‌లో ప్రారంభించడం వెనక ఉద్దేశమేమిటని శనివారం జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మధుసూదన్‌ రెడ్డి ప్రశ్నించారు. కొఠారీ కమిషన్‌ సిఫారసుల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో నాడు విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు ఉన్నప్పటినుంచే ఇంటర్‌లో 100మార్కుల పరీక్షల విధానం కొనసాగుతోందన్నారు. ఇంటర్నల్‌ విధానంతో రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీలు మరింత రెచ్చిపోతాయని, ఈ నిర్ణయంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 26 , 2025 | 04:31 AM