Plant Communication,: మొక్కల మాటలు కీటకాలకు అర్థమవుతాయ్
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:17 AM
మొక్కల మాటలను కీటకాలు అర్థం చేసుకోగలవని ఓ తాజా పరిశోధన వెల్లడించింది.
టెల్‌అవీవ్ వర్సిటీ పరిశోధకుల వెల్లడి.. ఆడ చిమ్మటలపై ప్రయోగాల ద్వారా ఆవిష్కరణ
ప్రకృతిలోని ధ్వని సమాచార వ్యవస్థల అధ్యయనంలో కొత్త పరిణామం
న్యూఢిల్లీ, జూలై 16: మొక్కల ‘మాటలను’ కీటకాలు అర్థం చేసుకోగలవని ఓ తాజా పరిశోధన వెల్లడించింది. ప్రకృతిలో ఉన్న ధ్వనిపరమైన సమాచార వ్యవస్థల అధ్యయనంలో ఇది ఒక కొత్త పరిణామం. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన జరిపారు. దీంట్లో భాగంగా ఆడ చిమ్మటల మీద వారు కొన్ని ప్రయోగాలు జరిపారు. సాధారణంగా, ఆడ చిమ్మటలు తమ గుడ్లను టమాటో మొక్కల మీద పొదుగుతుంటాయి. గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలకు అవసరమైన ఆహారం కోసం అవి ఆ పని చేస్తుంటాయి. అయితే, ఆరోగ్యవంతమైన టమాటో మొక్కను గుర్తించటానికి ఆడ చిమ్మటలు ధ్వనితరంగాల మీద ఆధారపడుతుంటాయి. నీళ్లు లేక అలమటించే టమాటో మొక్కలు తమ పరిస్థితిని అలా్ట్రసోనిక్ సంకేతాల ద్వారా తెలుపుతుంటాయి. ఈ సంకేతాలను అర్థం చేసుకోవటం ద్వారా ఆడ చిమ్మటలు.. నీళ్లు లేక ఎండిపోతున్న వాటి మీద కాకుండా.. ఆరోగ్యంగా ఉన్న టమాటో మొక్క మీద తమ గుడ్లను పొదుగుతాయని టెల్‌అవీవ్ వర్సిటీ పరిశోధకులు జరిపిన ప్రయోగాల ద్వారా తెలిసింది. ఈ పరిశోధనకు సారథ్యం వహించిన ప్రొఫెసర్ ర్యా సెల్ట్‌జర్, ప్రొఫెసర్ గ్యూజెర్ ఎషల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మొక్కలకు, కీటకాలకు మధ్య ధ్వనిపరమైన కమ్యూనికేషన్ ఉంటుందని తొలిసారిగా రుజువైందన్నారు. వ్యవసాయం, కీటక నియంత్రణ, పంటల నాణ్యత తదితర రంగాల్లో ఈ పరిశోధన ఉపయోగపడవచ్చని భావిస్తున్నారు.