Brahmaputra River : బ్రహ్మపుత్రపై భారత్ భారీ రిజర్వాయర్
ABN , Publish Date - Jan 28 , 2025 | 06:02 AM
భారత ప్రభుత్వం దేశంలోకెల్లా పెద్దదైన జల విద్యుత్ కేంద్రాన్ని అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టింది. చైనా సరిహద్దులకు కాస్త దిగువన నిర్మించే దీని ఖర్చు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలు.
చైనా ‘వాటర్ బాంబ్’ రిజర్వాయర్‌కు చెక్
న్యూఢిల్లీ, జనవరి 27: భారత ప్రభుత్వం దేశంలోకెల్లా పెద్దదైన జల విద్యుత్ కేంద్రాన్ని అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించ తలపెట్టింది. చైనా సరిహద్దులకు కాస్త దిగువన నిర్మించే దీని ఖర్చు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏకంగా 325 టీఎంసీల నీటిని నిల్వచేసే రిజర్వాయర్‌ను కట్టబోతున్నారు. నిజానికి పర్యావరణపరంగా ఆలోచిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో అంతపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. కానీ, ఎగువన చైనా నిర్మిస్తున్న మరో అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం నుంచి దిగువన బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పు నుంచి కాచుకోవాలంటే ఈ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించక తప్పడం లేదు. చైనా సరిగ్గా భారత్ సరిహద్దుల్లో తలపెట్టిన రిజర్వాయర్‌ను ఈశాన్య రాష్ట్రాలపై సంధించిన వాటర్ బాంబుగా పరిగణిస్తున్నారు. చైనా జలాశయంలో 194 టీఎంసీలను నిలువ చేయవచ్చు. దీనిపై 60 వేల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. చైనా చెబుతున్న కారణం జల విద్యుత్తే అయినా.. ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా ప్రతీకార చర్యల్లో భాగంగా ఈ డ్యాం గేట్లు ఎత్తేస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వేల ఊళ్లు కొట్టుకుపోతాయి. దాన్ని ఎదుర్కోవడానికే దిగువన పరాంగ్ అనే ప్రాంతంలో భారత్ ఏకంగా 325 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది. దీనివల్ల చైనా ఒకేసారి తన డ్యామ్‌ను ఖాళీ చేసినా దిగువన భారత్ నిర్మిస్తున్న జలాశయం మొత్తం వరదను కాచుకోగలదు.